హరియాణా చర్ఖీ దాదరిలోని అటెలా కలాన్ గ్రామానికి చెందిన కల్లూరామ్.. పక్షులు, జంతువుల దాహార్తిని తీర్చడానికి ఏకంగా కొండపైనే ఓ కుంటను నిర్మించారు. ప్రస్తుతం 90 ఏళ్ల వయసున్న ఆయన.. 80 అడుగుల లోతైన కుంటను నిర్మించారు. 50 ఏళ్ల పాటు శ్రమించి 2010లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ కుంట నిర్మాణంతో ఏటా అనేక పక్షులు, జంతువులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి.
18 ఏళ్ల వయసులో ఉండగా.. కల్లూరామ్ పశువులను మేపడానికి కొండపైకి వెళ్లేవారు. ఆ సమయంలో అనేక పక్షులు, జంతువులు దాహర్తికి తట్టుకోలేక మరణించేవి. దీన్ని చూసి కలత చెందిన కల్లూరామ్.. ఈ సమస్య పరిష్కారానికి ఏదైనా చేయాలని అనుకున్నారు. జంతువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ఏకంగా కొండపైనే ఓ నీటి కుంటను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా సుత్తి, ఉలిని తీసుకుని కొండను తొలచడం ప్రారంభించారు.
ఈ కుంట నిర్మాణం ప్రారంభించినపుడు గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు అందరూ తనని విమర్శించారని కల్లూరామ్ గుర్తు చేసుకున్నారు. అందరూ అవహేళన చేసినా.. పక్షులు, జంతువులకు ఏదైనా చేయాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోలేదు కల్లూరామ్. కుంట నిర్మాణం పూర్తయ్యాక రహదారి నిర్మాణంలో కుమారుడు, మనుమడు సహాయం అందిస్తున్నారని తెలిపారు. మైనింగ్ వల్ల ఈ కుంట ధ్వంసమవుతోందని కల్లూరామ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం 90 ఏళ్ల వయసున్న కల్లూరామ్.. ఇప్పటికీ ఉదయం నాలుగు గంటలకే లేచి కొండపైకి వెళుతున్నారు. రెండు కిలోమీటర్ల ఎత్తులోని కొండను ఎక్కి.. అక్కడ రాళ్లను సేకరించి ఆ కుంట చుట్టూ అందంగా పేర్చుతున్నారు. ఆ కుంటను చేరుకోవడానికి దారిని ఏర్పాటు చేస్తున్నారు. కొండపై కుంటను నిర్మించిన విషయం తెలుసుకున్న ఎంపీ ధరంబీర్సింగ్.. ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆయనను అభినందించారు. అయితే ఈ కుంట వరకు రహదారిని నిర్మించాలని కల్లూరామ్ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: ఇంట్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 50మీటర్ల దూరంలో శరీరభాగాలు!
ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం.. ఆదివాసీ సంప్రదాయాలతో వైభవంగా..