కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతి.. ఓ యువకుడిపై కోపంతో అతడి సోదరిని టార్గెట్ చేసింది. ఆమె పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచి.. అందులో ఆమెను కాల్‌గర్ల్‌గా పరిచయం చేసింది. మార్ఫింగ్ ఫొటోలు చేసి ఆమె ఫోన్ నంబర్‌ను కూడా అప్లోడ్ చేసింది. దీంతో బాధితురాలికి వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ రాగా, బాధిత కుటుంబ సభ్యులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు నిందితురాలని పట్టుకుని ఆ అకౌంట్‌ను డిలీట్ చేశారు. నిందితురాలు.. బాధితురాలి సోదరుడికి స్నేహితురాలని వెల్లడించారు. ఆ కుర్రాడు.. తన స్నేహితుడికి ఆమెను ప్రేమించవద్దని సూచించడంతో కోపం పెంచుకుని.. అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలాంటి పని చేసిందని అధికారులు వెల్లడించారు.
అడవిలో నగ్నంగా పడి ఉన్న మృతదేహాలు.. రాజస్థాన్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అడవిలో గుర్తు తెలియని రెండు నగ్న మృత దేహాలను స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉదయ్‌పుర్ జిల్లాలోని గోగుండా ప్రాంతంలోని ఉబేశ్వర్‌జీ మహాదేవ్ అడవుల్లో.. నగ్నంగా పడి ఉన్న ఓ యువతి, యువకుడి మృత దేహాలను స్థానికులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో యువకుడి జననాంగం కట్ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వారిని ఎవరో రెండు రోజులు క్రితం హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మృతుల వివరాలు ఇంకా తెలియలేదని.. దీనిపై పూర్తి విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ వికాశ్ శర్మ తెలిపారు.
కౌన్సిలర్ ఇంటిపై ఎండబెట్టిన పులిచర్మం.. తమిళనాడులోని థేనీ జిల్లాలో ఎండబెట్టిన పులి చర్మాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అమ్మపట్టి గ్రామానికి చెందిన మాజీ పంచాయితీ కౌన్సిలర్ దురైపాండియన్ ఇంటిపై చిరుతపులి చర్మం ఎండబెట్టినట్లు అటవీశాఖా అధికారులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. పసుపు పూసిన ఉన్న చిరుతపులి చర్మాన్ని గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకున్న అధికారులు పరారీలో ఉన్న దురైపాండియన్ కోసం గాలించడం ప్రారంభించారు.