తన కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించాడని అతడి బేకరీ షాప్‌ను తగలబెట్టాడు బాలిక తండ్రి. కేరళలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక బుధవారం సాయంత్రం చేరనల్లూరులో ఉన్న బాబురావు బేకరీ షాప్‌కు వెళ్లింది. అదే సమయంలో బాలికతో షాప్ యజమాని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక ఆ విషయాన్ని తండ్రికి తెలిపింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలిక తండ్రి.. బాబురావు బేకరీ షాప్‌ను పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆ సమయంలో బాబురావు భార్య షాప్‌లో ఉంది. ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. బాబురావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బేకరీ యజమాని భార్య ఫిర్యాదు మేరకు బాలిక తండ్రిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం.. బంధువుల ఆందోళన..
దిల్లీలోని భాల్స్వా డెయిరీ ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్లడ్డ కేసులో ఎలాంటి పురోగతి జరగలేదు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి 24 గంటల గడుస్తున్నా.. నిందితుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదంటూ బాధితురాలి బంధువులు ప్రధాన రహదారిని నిర్భందించారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్వల్ప లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా ఘటనపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
బాధిత బాలికను గుర్తు తెలియని ఓ వ్యక్తి బుధవారం కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. గురువారం ఉదయం 8 గంటలకు భాల్స్వా చెరువు వద్ద అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని.. చిన్నారిని బాబు జగ్జీవన్ రావ్ హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బాలిక పరిస్థితి మరింతగా విషమించడం వల్ల ఆమెను అంబేడ్కర్ హాస్పిటల్‌కు తరలించారు.
అత్యాచార నిందితుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఐదు సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ కేసులో గణేశ్ అనే నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది పొక్సో కోర్టు. 2020లో ఈ ఘటన జరగ్గా.. గురువారం ఈ కేసుపై కోర్టు తీర్పు వెల్లడించింది. రూ.22 వేలు జరిమానా సైతం కట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. జరిమానా కట్టలేకపోయినట్లయితే మరో 18 నెలలు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. బాధితురాలికి రూ.6 లక్షల పరిహారం ఇవ్వాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి ఆదేశించింది.
కాగా, గతేడాది జనవరి 26న బామునిగావ్ ప్రాంతానికి చెందిన గణేశ్.. ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను మిఠాయిలు ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై.. తిరిగి ఇంటికి వస్తున్న పాఠశాల విద్యార్థులు బాలిక కేకలు విన్నారు. సమాచారాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు.. బాలికను రక్షించారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు పోలీసులు.
కూతురిపై తండ్రి అత్యాచారం.. 31 సంవత్సరాల జైలు శిక్ష..
కన్నకూతురిపై అత్యాచారం చేసి ఆమె గర్భానికి కారణమైన తండ్రికి.. కేరళ కోర్టు 31 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రూ. 75 వేలు కట్టాలని ఆదేశించింది. బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించింది. పిండం నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ శిక్ష విధించింది. నిందితుడు ఇడుక్కి జిల్లా కొన్నతడి గ్రామం చెందిన వ్యక్తి. 2016లో ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై (అప్పటికి 14 ఏళ్ల వయస్సు) అతడు అనేక సార్లు లైంగిక దాడి చేశాడు.