Teachers on students door: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. కొన్ని రోజుల తర్వాత కరోనా తగ్గి పాఠశాలలు తెరిచినా.. విద్యార్థుల హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం మళ్లీ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలలను మూసివేశారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లింది. ఈ క్రమంలో పిల్లలు చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో సరికొత్త ఆలోచన చేశారు ఓ టీచర్. 'విద్యార్థుల ఇంటికే ఉపాధ్యాయులు' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి పాఠాలు చెబుతున్నారు. ఆయనే.. బిహార్, గయా జిల్లాలోని షెర్పుర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్తర్ హుస్సేన్.

ప్రతిరోజు ఉదయాన్నే గ్రామానికి చేరుకుంటారు హుస్సేన్. ఐదారుగురు విద్యార్థులను ఒకదగ్గరకి చేర్చి వారికి పాఠాలు చెబుతారు. ఇలా చేయటం ద్వారా పాఠశాలలు మూతపడినా విద్యార్థులు చదువుకు దూరం కారని చెబుతున్నారు. మరో ముగ్గురు ఉపాధ్యాయులతో కలిసి.. రోజుకు 75 మంది విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు. మిగిలిన పిల్లలను మరుసటి రోజు కలుస్తారు.

గత ఏడాది లాక్డౌన్ తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ చాలా మంది విద్యార్థులు హాజరుకాలేదని చెప్పారు హుస్సేన్. వారిని స్కూల్‌కు తీసుకొచ్చేందుకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. పాఠశాలలు మూతపడటం వల్ల విద్యార్థుల్లో చదువుకోవాలన్న ఆలోచన తగ్గిపోతుందని చెప్పారు.

"గత ఏడాది కరోనా కారణంగా పాఠశాలలు మూతపడిన సమయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ కారణంగా పాఠశాలకు రాని 50 శాతం మంది విద్యార్థుల గురించి ఆలోచన చేశాం. వారి ఇంటికే వెళ్లి చదువు చెప్పటం ద్వారా హజరు శాతం పెరుగుతుందని భావించాం. నాతో పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారంతా చాలా సహకరిస్తున్నారు. అర్ధగంట చొప్పున విద్యార్థుల ఇళ్లల్లో పాఠాలు చెబుతున్నాం."
- అక్తర హుస్సేన్, ప్రధానోపాధ్యాయుడు.
హెడ్మాస్టర్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చదువు అందటమే కాకుండా వారి సమయం వృథా కాదని చెప్పారు ఓ మహిళా టీచర్. చిన్నారులు కష్టపడి చదువుతున్నట్లు తెలిపారు.

తమకు పాఠశాలలో మాదిరిగానే చదువు చెబుతున్నారని, ఎలాంటి ఫీజు వసూలు చేయటం లేదని విద్యార్థులు తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: కార్ షోరూమ్‌లో అవమానం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు..'స్నేహం కోసం' రిపీట్!