గ్యాస్ వినియోగదారులకు పుదుచ్చేరి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతున్న.. ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని అందిస్తామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ఈ ప్రకటన చేశారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఒక సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ. 126 కోట్లు కేటాయించామని రంగస్వామి తెలిపారు. నిరుగ్యోగులకు ఉపాధి కల్పించడానికి.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన పరిశ్రమలకు సబ్సిడీ ఇస్తామని ముఖ్యమంత్రి రంగస్వామి వెల్లడించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రూ. 11,600 కోట్ల వార్షిక బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
త్వరలో వివిధ దేశాలకు చెందిన తమిళ పండితుల భాగస్వామ్యంతో ప్రభుత్వం 'ప్రపంచ తమిళ సదస్సు'ను నిర్వహిస్తామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు. దీంతో పాటు శ్రీ అరబిందో 150వ జయంతిని పురస్కరించుకుని.. ఆయన ఆలోచనలు, తత్వశాస్త్రం, యోగా, సాహిత్యంపై పరిశోధన కోసం ఒక జాతీయ సదస్సును కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
రాజస్థాన్‌లోనూ తగ్గనున్న గ్యాస్ ధరలు..
గతేడాది డిసెంబర్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ గ్యాస్ ధర తగ్గింపుపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉజ్వల్ పథకం లబ్ధిదారులు వినియోగిస్తోన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు సగానికి పైగా తగ్గించనున్నట్టు ఆశోక్ గహ్లోత్ వెల్లడించారు. ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు 2023 ఏప్రిల్ 1 నుంచి కేవలం రూ.500లకే రీఫిల్ చేయించుకొనే వెసులుబాటు కల్పించనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఉజ్వల్ పథకంలో నమోదు చేసుకొని దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలే దీనికి అర్హులని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన అశోక్ గహ్లోత్ ఈ ప్రకటన చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సగం ధరకే అందజేస్తామన్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో అవస్థలు పడుతున్న జనానికి ఉపశమనం కలిగించేలా 2023లో ఎన్నికలు జరగనున్న వేళ గహ్లోత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.