ఇంధన ధరల పెరుగుదలపై బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ స్పందించకుంటే.. వారి సినిమా ప్రదర్శనలను మహారాష్ట్రలో నిలిపివేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే హెచ్చరించారు. వారి సినిమా షూటింగ్‌లను అనుమతించబోమని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చమురు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా గళమెత్తిన సదరు నటులు.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
"మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు పెరిగినప్పుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి నటులు ట్వీట్ల ద్వారా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పెట్రో ధరలు పెరిగినప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. దీనిపై వారు స్పందించకుంటే వారి సినిమాలు, షూటింగ్‌లను మహారాష్ట్రలో అనుమతించం. ఇప్పుడు కూడా వారు ఆ విధంగానే.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన తెలపాలి."
--నానా పటోలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
పెరిగిన పెట్రో ధరలతో సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారని పటోలే అన్నారు. మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును చేరిన నేపథ్యంలో పటోలే ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తప్పనిసరి చేసిన ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని పటోలే విమర్శించారు.
'ఇది నానా పటోలే పబ్లిసిటీ స్టంట్'
నానా పటోలే వ్యాఖ్యలపై భాజపా స్పందించింది. ప్రజస్వామ్యం, చట్టాలున్న దేశంలో సినిమా షూటింగ్‌లను ఎవరైనా ఎలా ఆపగలరని ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన నానా పటోలే.. ప్రజలను ఆకర్షించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి:మేం అధికారంలోకి వస్తే మహిళలకు 33% కోటా: షా