Free Medical Treatment To Road Accident Victims : రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్యం అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది! దేశమంతటా ఈ విధానాన్ని మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు.
దిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ (IRTE) నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు భారత్‌లో జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "మోటరు వాహన చట్టం 2019 సవరణ(MVA 2019) ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం.. ఉచిత, నగదు రహిత వైద్యం అందించాలి. దీన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. ఇప్పడు దేశవ్యాప్తంగా ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖతో కలిసి రోడ్ రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది" అని అనురాగ్ జైన్ తెలిపారు.
మూడు-నాలుగు నెలల్లో ఈ సదుపాయం దేశమంతటా అందుబాటులోకి వస్తుందని అనురాగ్ జైన్ వెల్లడించారు. మోటరు వాహన చట్టం సవరణ ప్రకారం గోల్టెన్ అవర్(ప్రమాదం జరిగిన తొలి గంట)లో ఆస్పత్రిలో చేరిన బాధితులతో పాటు మిగతా వారికి కూడా చికిత్స అందిస్తామని చెప్పారు. త్వరలోనే పాఠశాల, కళాశాల పాఠ్యపుస్తకాల్లో రహదారి భద్రత అంశాన్ని చేర్చడానికి విద్యాశాఖ అంగీకరించిందని ఆయన వెల్లడించారు.
ఇకపై వాహనాల్లో హెచ్చరిక వ్యవస్థ!
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, సైక్లిస్ట్‌లను వాహనాలు ఢీకొట్టకుండా సహాయపడే వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇన్‌బిల్ట్ 'మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్' (MOIS) సిస్టమ్‌లను కొన్ని కేటగిరీలకు చెందిన ప్రయాణికుల, వాణిజ్య వాహనాల్లో ఉండేలా ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇది అమలులోకి వస్తే వాహన తయారీ సంస్థలు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.