ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ (air india privatisation) ప్రక్రియ మొదలుకావడంతో ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్ అయ్యాయి. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రొటోకాల్ అమలు చేసేవారు. ఇకమీదట ఆ సదుపాయం ఉండదు. ఎంపీలు డబ్బు పెట్టి విమాన టికెట్లు కొనాలని శుక్రవారం విడుదలైన రాజ్యసభ సచివాలయ బులెటిన్ సభ్యులకు సూచించింది. పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా (mps allowances) 34 విమాన టికెట్లు, వారి జీవిత భాగస్వామికి మరో 8 టికెట్లు గతంలో ఉచితంగా ఇచ్చేవారు. వాటి కొనుగోలుకు పార్లమెంటు ఉభయసభల సచివాలయాలు 'ఎక్స్ఛేంజ్ ఆర్డర్' జారీ చేసేవి. ఆ ఉత్తర్వులు చూపి డబ్బు పెట్టకుండానే ఎంపీలు ఎయిర్ ఇండియా టికెట్లు కొనుగోలు చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశారు. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ఎక్స్ఛేంజ్ ఆర్డర్లను అనుసరించి టికెట్లు కొని ఉంటే అందుకు సంబంధించిన టీఏ క్లెయిమ్‌లు చేసుకోవచ్చు.
ఇలాగైతే ఇబ్బందే మరి..
కొత్త నిబంధన ఎంపీలకు కొంత ఇబ్బందికరమేనని వారి వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చాలామంది ఎంపీలకు మార్కెట్ రేటుకు టికెట్లు కొనేంత ఆర్థికస్తోమత ఉండదని, అలాంటివారు నగదు పెట్టి కొనడం ఇబ్బంది అవుతుందన్నారు. టికెట్ల మొత్తాన్ని తదుపరి దశలో రీఎంబర్స్ చేసినప్పటికీ, ఆ బిల్లుల క్లియరెన్సుకు సమయం పడుతుంది కాబట్టి, ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్‌ను సైతం కేంద్రం తాత్కాలికంగా స్తంభింపజేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీలకు 10 సీట్ల కోటాతోపాటు కేంద్రమంత్రి విచక్షణాధికారం కింద మరికొన్ని సీట్లు మంజూరు చేసేవారు. ఇప్పుడు ఆ అదనపు కోటా రద్దు చేశారు.
ఇదీ చదవండి:యూపీఎస్సీ ప్రిలిమ్స్-2021 ఫలితాలు విడుదల