ఉత్తర్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై దేశద్రోహం కేసు(Sedition case) నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై(Yogi Adityanath Government) అనుచిత వ్యాఖ్యలు చేశారని భాజపా కార్యకర్త ఆకాశ్ సక్సేనా చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. రామ్‌పుర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఖురేషీపై సక్సేనా ఫిర్యాదు చేశారు.
ఖురేషీపై ఐపీసీలో సెక్షన్ 124ఏ, 153ఏ, 153బీ, 505(1)(బీ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్‌పుర్ ఎమ్మెల్యే అజామ్ ఖాన్, ఆయన భార్య తంజీమ్ ఫాతిమాను కలిసేందుకు.. వారి ఇంటికి ఖురేషీ వెళ్లారని తన ఫిర్యాదులో సక్సేనా పేర్కొన్నారు. ఆ సమయంలో యోగి ఆదిత్యానాథ్ సర్కారును 'రక్తం తాగే పిశాచి ప్రభుత్వం' అంటూ ఖురేషీ వ్యాఖ్యానించారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించే విధంగా, మత కల్లోలాలను రేకెత్తించేలా ఉన్నాయని సక్సేనా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సీఎం తండ్రిపై కేసు.. 'చట్టానికి ఎవరూ అతీతులు కారు'
ఇదీ చూడండి: Rss Taliban: 'ఆరెస్సెస్ కార్యకర్తలు, తాలిబన్లు ఒకటే'