బంగాల్లో ఎన్నికల వేళ.. కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఐదుగురికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అభ్యర్థులు ముగ్గురు కాగా.. భారతీయ జనతా పార్టీ(భాజపా), రివల్యూషన్ సోషలిస్ట్ పార్టీ(ఆర్ఎస్పీ)ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు తెలిపింది.
ఆ అభ్యర్థులు ఎవరంటే?
- మహమ్మద్ గులామ్ రబ్బానీ - టీఎంసీ - గోల్పోఖర్ అసెంబ్లీ నియోజకవర్గం
- కల్పనా కిస్కూ - టీఎంసీ - తపన్ శాసనసభ నియోజకవర్గం
- డాక్టర్ ప్రదీప్ కుమార్ బర్మా - టీఎంసీ - జల్పాయ్ గురి అసెంబ్లీ స్థానం
- ఆనందమయ్ బర్మాన్(38) - భాజపా - మాటిగరా-నక్సల్బారి సీటు
- ప్రదీప్ కుమార్ నంది(73) - ఆర్ఎస్పీ - జంగీపుర్ నియోజకవర్గం
వైరస్ బారినపడిన అభ్యర్థులందరూ తక్షణమే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఆయా బాధితులంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని, వ్యాధి తీవ్రతను బట్టి ఆస్పత్రిలో చేరాలని స్పష్టం చేసింది.
అంతకుముందు.. ముర్షిదాబాద్ జిల్లాలోని శంషేర్‌గంజ్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి రెజౌల్ హాక్ కొవిడ్ కారణంగా.. గురువారం తెల్లవారుజామున ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలి: మోదీ