60 ఏళ్ల నాగాలాండ్ రాజకీయ చరిత్రలో మొదటిసారి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యే కాలేదు. 48 ఏళ్ల హెకానీ జఖాలు, సల్హౌతునొ క్రుసో(56) విజయం సాధించి చరిత్రకెక్కారు. నాగాలాండ్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. అకులుటో శాసనసభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఖేకషీ సుమి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం వల్ల భాజపా అభ్యర్థి కజేటో కినిమి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. దీంతో 59 స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఈ 59 సీట్లకు మొత్తం 183 అభ్యర్థులు పోటీ పడ్డారు.
183 మందిలో.. ఆ నలుగురు..
ఈ ఎన్నికల్లో పోటీ పడ్డ 183 అభ్యర్థుల్లో కేవలం నలుగురు మాత్రమే మహిళలు. ఇందులో అధికార ఎన్డీపీపీ నుంచి ఇద్దరు మహిళా అభ్యర్థులు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒకరు చొప్పున తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో సామాజిక కార్యకర్త, న్యాయవాది హెకానీ జఖాలు కూడా ఉన్నారు. ఈమె రాష్ట్రంలోని దిమాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1536 ఓట్ల మెజార్టీతో ఎల్జేపీ(రామ్‌విలాస్)పార్టీకి చెందిన అజితో జిమోమిపై గెలుపొందారు. ఇక ఎన్డీపీపీకే చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌతునొ క్రుసో.. 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజకీయా పార్టీలు అత్యధికంగా ఐదుగురు మహిళలకు టికెట్లు ఇచ్చాయి. కానీ ఎవరూ గెలవలేదు.
హెకానీ జఖాలు..
ఈమె తన విద్యాభ్యాసాన్ని అమెరికాలో పూర్తి చేశారు. ప్రస్తుతం ఈమె 'యూత్ నెట్ నాగాలాండ్' అనే స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ ఆ రాష్ట్రంలో యువతకు చదువుతో పాటు ఉద్యోగ, వ్యాపార అవకాశాలను కల్పించడంలో సహాయపడుతుంది. ఇక 2018లో నారీ శక్తి పురస్కారాన్ని కూడా అందుకున్నారు హెకానీ జఖాలు.
1963 నవంబర్ 30న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నాగాలాండ్‌లో ఇప్పటివరకు 13 శాసనసభ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 13.17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు సగం అంటే 6.56 లక్షల మంది మహిళా ఓటర్లే.. అయినా 60 ఏళ్ల నుంచి ఒక్కరంటే ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలిచి నాగాలాండ్ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడం గమనార్హం. ఈ 13వ అసెంబ్లీ పదవీకాలం ఈ నెల 12తో ముగియనుంది. ఐతే ఈ కూటమి విజయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా నిజమయ్యాయి. నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి 38-48 సీట్లు గెలుచుకొని తమ అధికారాన్ని నిలబెట్టుకుంటాయని అంచనా వేశాయి.