SBI Report On DBT Scheme : ఎన్నికలు అని చెప్పగానే రాజకీయ పార్టీల ఉచిత హామీలే గుర్తుకొస్తున్నాయి!. ప్రత్యేకించి గత కొన్నేళ్లలో మహిళలపై పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. వనితలకు నేరుగా ఆర్థికసాయాన్ని అందజేసేందుకు ఉద్దేశించిన 'నగదు బదిలీ' పథకాలను పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఈ తరహా పథకాలు అమలవుతున్నాయి. ఇలా ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కీలక నివేదికను విడుదల చేసింది.
మహిళా సంక్షేమం పేరుతో వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న నగదు బదిలీ పథకాల సునామీ ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఎస్‌బీఐ హెచ్చరించింది. ఓట్ల కోసం, ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశంతోనే ఈ తరహా పథకాలను కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయని నివేదికలో అభిప్రాయపడింది. ఈ తరహా పథకాల వ్యయం దేశంలోని 8 రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 లక్షల కోట్లను దాటిందని ఎస్‌బీఐ తెలిపింది. ఆయా రాష్ట్రాలు ఆర్జిస్తున్న వార్షిక ఆదాయంలో ఈ పథకాల వ్యయం దాదాపు 3 నుంచి 11 శాతానికి సమానంగా ఉందని వెల్లడించింది.
అయితే ఒడిశా లాంటి రాష్ట్రాలు ఈ తరహా పథకాల వ్యయాలను పూడ్చుకునేందుకు పన్నేతర ఆదాయాలను పెంచుకొని, అప్పులను తగ్గించుకున్నాయని ఎస్‌బీఐ నివేదికలో ప్రస్తావించింది. ఈవిధంగా ప్రణాళిక రచించుకోని ఇతరత్రా రాష్ట్రాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. 'మహిళల సంక్షేమానికి ఉద్దేశించిన నగదు బదిలీ పథకాలకు నిధులను కేటాయించగల సామర్థ్యం దేశంలోని కొన్ని రాష్ట్రాలకు ఉంది. దీనికి ఉదాహరణగా ఒడిశాను తీసుకోవచ్చు. ఆ రాష్ట్రానికి పన్నేతర ఆదాయాలు గణనీయంగా వస్తున్నాయి. దీంతో అది కొత్తగా అప్పులు చేయడం లేదు' అని నివేదికలో ఉదహరించారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా
- కర్ణాటక రాష్ట్రంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతీ కుటుంబం నుంచి ఒక మహిళకు నెలకు రూ. 2,000 అందిస్తారు. ఇందుకోసం ఒక ఏడాదికి రూ.28,608 కోట్లు కేటాయించారు. ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడులలో అగి 11 శాతానికి సమానం.
- బంగాల్లో లక్ష్మీర్ భండార్ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు రూ.1,000 చొప్పున వన్ టైం గ్రాంటును అందిస్తారు. ఇందుకోసం ఏటా రూ.14,400 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 6 శాతానికి సమానం.
- మహిళా సమ్మాన్ యోజన పథకం ద్వారా వయోజన మహిళలకు (కొన్ని వర్గాలకు మినహా) ప్రతినెలా రూ.1,000 చొప్పున అందిస్తామని దిల్లీలోని ఆప్ సర్కారు అంటోంది. ఇందుకోసం ఏటా రూ. 2,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది దిల్లీ వార్షిక రెవెన్యూ రాబడిలో 3 శాతానికి సమానం.
కేంద్రం, రాష్ట్రాల సంయుక్త గ్రాంట్లతో అమలుచేస్తే
రాష్ట్రాలలో ఈ తరహా పథకాలకు ప్రజాదరణ పెరుగుతుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తోందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. మహిళల కోసం ఈవిధమైన నగదు బదిలీ పథకాలను ప్రారంభించాలని కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రం వేర్వేరుగా కాకుండా జాతీయస్థాయిలో సార్వత్రిక నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని ఎస్‌బీఐ అభిప్రాయపడింది. జాతీయ స్థాయిలో రూపకల్పన చేసే పథకాల అమలు కోసం రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సరిసమానంగా గ్రాంట్లను విడుదల చేస్తే బాగుంటుందని తెలిపింది. ఫలితంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా అడ్డుకట్ట వేయొచ్చని, వాటిపై రాయితీల భారాన్ని తగ్గించొచ్చని విశ్లేషించింది. భారీ బడ్జెట్ అవసరమయ్యే నగదు బదిలీ పథకాలను అమలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస అంచనాలు వేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. ఉచిత హామీలను అమలు చేసే జోష్‌లో ఆర్థిక స్థితిగతులను రాష్ట్రాలు విస్మరిస్తే దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది.