CM Revanth Review Meeting : రేపే ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తామని అన్నారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో ఈ నాలుగు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున నలుగురు అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సమీక్ష అనంతరం మంత్రులు మీడియాకు వివరాలు వెల్లడించారు.
గ్రామసభలు నిర్వహించి అర్హత కలిగిన వారు ఎంపిక : జనవరి 26న లాంఛనంగా పథకాలు ప్రారంభిస్తామని చెప్పామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామసభలు నిర్వహించి అర్హత కలిగిన లబ్ధిదారుల వద్ద దరఖాస్తులు స్వీకరించామన్నారు. రేపు రాష్ట్రంలో 4 కొత్త పథకాలు ప్రారంభిస్తామని మరోసారి స్పష్టం చేశారు. రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పథకాలు ప్రారంభిస్తామన్నారు.
అర్హులందరికీ పథకాలు : అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయయోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామన్నారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తామని పేర్కొన్నారు. రేపు మండలానికి ఒక గ్రామంలో సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు : రేపు మండలానికి ఒక గ్రామంలో సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు 4 పథకాలు ప్రారంభిస్తామన్నారు. ఇచ్చిన రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.
ఇది ప్రజల ప్రభుత్వం - పేదల ప్రభుత్వం : ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ 4 పథకాలు ఇస్తున్నామన్నారు. ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేస్తామని మంత్రి చెప్పారు.
ముగిసిన గ్రామ సభలు - వాటి కోసమే ఎక్కువ దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ - దరఖాస్తులకు మరో చాన్స్