విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తే వారికి పరీక్షల భయం చాలా వరకు తగ్గిపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షల కాలం నేపథ్యంలో భయాన్ని తొలగించి వారిలో నమ్మకాన్ని పెంచడం కోసం మోదీ పరీక్షాపై చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో ముచ్చటించారు.
వర్చువల్ మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు, అధ్యాపకులతో కూడా మోదీ సంభాషించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పల్లవి అనే 9వ విద్యార్థిని.. పరీక్షల సమయం దగ్గరకు వచ్చే సమయంలో తలెత్తే ఆందోళనను ఎలా తొలగించుకోవాలని అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిచ్చారు.
విద్యార్థులపై తల్లిదండ్రులు, అధ్యాపకులు, మిత్రులు ఒత్తిడి చేయడం మానేస్తే పరీక్షలు అనేవి వారికి చాలా సులభతరంగా మారుతాయని మోదీ అన్నారు. జీవితంలో ఎన్నో దశలు ఉంటాయని, పరీక్షలు కూడా ఓ దశ అని అభిప్రాయపడ్డారు. అందువల్ల విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని వారిలో భరోసా నింపారు.