కర్ణాటక కోలార్‌లో దారుణం జరిగింది. నాలుగో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టిందని ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై శ్రీనివాస్పుర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడిని లోకేశ్(38)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలార్‌లోని శెట్టిహళ్లికి చెందిన లోకేశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరుకు చెందిన శిరీషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నెల 4న లోకేశ్ భార్య శిరీష మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు లోకేశ్. తన తల్లిని తమ్ముడు మంజునాథ్ ఇంటికి పంపించేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లోకేశ్ తల్లి ఇంటికి వచ్చి చూడగా కుమారుడు విగతజీవిగా కనిపించాడు. వెంటనే లోకేశ్ తమ్ముడు మంజునాథ్‌కు సమాచారం అందించింది. అప్పటికే లోకేశ్ మరణించాడు.
కుమార్తె గొంతునులిమి..
రాజస్థాన్ కోటాలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ.. కుమార్తె పట్ల దారుణంగా ప్రవర్తించింది. రేఖా కన్వర్(38) అనే మహిళ తన 13 ఏళ్ల కూతురిని టవల్‌తో గొంతు నులిమి హత్య చేసింది. శనివారం జరిగిందీ ఘటన. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరచగా.. జ్యుడిషీయల్ కస్టడీకి తరలించమని న్యాయస్థానం ఆదేశించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రేఖా కన్వర్.. శివరాజ్ సింగ్ అనే ఆటో డ్రైవర్‌తో వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. రేఖ.. మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో తన కుమార్తె మెడపై టవల్‌తో గట్టిగా నులిమి హత్య చేసింది. ఆ సమయంలో నిందితురాలి పెద్ద కుమారుడు నాగేంద్ర(16) పాఠశాలకు వెళ్లాడు. ఆమె చిన్న కుమారుడు సింగం ఇంట్లోనే ఉన్నాడు. తన తల్లి.. సోదరిపై దాడి చేయడం చూసి ఇంటి బయటకు వెళ్లి ఇరుగుపొరుగువారిని పిలిచాడు. ఇరుగుపొరుగు వారు బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటి గేట్‌కు తాళం వేసి ఉండడం వల్ల.. వెంటనే వారు తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇవీ చదవండి: 'త్వరలో బంగాల్ విభజన! రెండు రాష్ట్రాలా? కేంద్ర పాలిత ప్రాంతంగానా?'
హత్యాచారం కేసులో వారికి మరణ శిక్ష రద్దు.. నిర్దోషులుగా ప్రకటిస్తూ సుప్రీం తీర్పు