తమ ఉద్యమానికి సంబంధం లేని రైతులుగా చెప్పుకునే నేతలు, సంఘాలతో ప్రభుత్వం తరుచుగా చర్చలు చేపడుతోందని పేర్కొన్నారు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్. కేంద్రానికి రైతుల సంఘాల సమాఖ్య రాసిన లేఖలో గట్టి హెచ్చరికలు పంపారు. అలాంటి చర్చలు తమ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నమేనని ఆరోపించారు. ప్రతిపక్షాలను చూసినట్లుగానే రైతులను కేంద్రం చూస్తోందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలో వస్తే.. ప్రభుత్వంతో చర్చలు చేపట్టేందుకు రైతులు, రైతు సంఘాలు ఎప్పుడూ సిద్ధమేనని కేంద్రానికి తెలిపారు. కేంద్రం పంపిన చర్చల ఆహ్వాన లేఖను తప్పుపట్టారు రైతులు. ఈ అంశంపై దిల్లీ సరిహద్దుల్లో సమావేశంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేంద్రానికి లేఖ రాశారు.
" ఈ చర్చల ప్రక్రియను కేంద్రం చేపడుతున్న తీరు.. ఈ అంశాన్ని ఆలస్యం చేయాలని, నిరసన తెలిపే రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. మా సమస్యలను ప్రభుత్వం తేలికగా తీసుకుంటోంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, సత్వరం పరిష్కారం కనుగొనాలని వారిని హెచ్చరిస్తున్నాం."
- యుధ్వీర్ సింగ్, భారతీయ కిసాన్ సంఘ్