నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రైతులు రైల్‌రోకో చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రైల్‌రోకో.. సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. రైతుల ఆందోళన నేపథ్యంలో ఉత్తర భారతంలో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తున్నారు.
ప్రయాణికులకు ఆహారం..
రైల్‌రోకో నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు పట్టాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్, లూథియానా, ఫతేనగర్ సాహిబ్, హరియాలోని పలు ప్రాంతాలు, జమ్ము, బిహార్‌లోని పట్నా, కర్ణాటక రాజధాని బెంగళూరులో రైతులు పట్టాలపై బైఠాయించారు.
ఆందోళనను శాంతియుతంగా చేపట్టాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. నిలిచిపోయిన రైళ్లలో ప్రయాణికులకు ఆహారం, నీళ్లు, పండ్లు అందిస్తామని తెలిపారు. వారికి నూతన రైతుల చట్టాల వల్ల సమస్యల గురించి వివరిస్తామని తెలిపారు.
హరియాణాలోని హిసర్‌లో రెండు ర్యాలీల్లో పాల్గొననున్నట్లు టికాయిత్ తెలిపారు. శుక్రవారం ముంబయిలో చేపట్టనున్నట్లు వివరించారు. రైతులు ప్రతిచోట ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. మద్దతు ధరకు చట్ట భద్రత కల్పంచడం ద్వారానే వాటన్నింటికి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
పటిష్ట భద్రత
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జనవరి 26న ఎర్రకోట వద్ద చేపట్టిన ఆందోళనలో హింస జరిగిన నేపథ్యంలో.. రైల్‌రోకోకు దేశవ్యాప్తంగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ 20 వేల మంది రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ , బంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:సిక్కుల పాక్ పర్యటనకు అనుమతి నిరాకరణ