నూతన వ్యవసాయ చట్టాలపై దిల్లీలో రైతులు చేపట్టిన నిరసన సెగ మంగళవారం యావత్ దేశాన్ని తాకనుంది. 'భారత్ బంద్'కు పిలుపునిచ్చిన రైతన్నలు.. తమ ఐక్యతను, చట్టాలపై వ్యతిరేకతను చాటిచెప్పేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలకు వివిధ పార్టీలు సంఘీభావంగా నిలిచి భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
'శాంతియుతంగానే ఆందోళనలు'
ఇప్పటివరకు తమ ఆందోళనలు శాంతియుతంగానే సాగాయని.. ఇకపైనా అదే విధంగా ఉంటాయని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికైట్ వెల్లడించారు. చట్టాలపై తమ వ్యతిరేకతను చాటేందుకు ఇది మంచి అవకాశమన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని విధానాలకు తాము మద్దతివ్వమని చెప్పేందుకు భారత్ బంద్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
'రాజకీయాలకు తావు లేదు'
తమ ఆందోళనల్లో రాజకీయాలకు తావు లేదని.. రాజకీయ నేతలకు తమ వేదికలపై అనుమతి లేదని స్పష్టం చేశారు రైతు సంఘాల నేత డా. దర్శన్ పాల్. మంగళవారం మొత్తం బంద్ పాటిస్తామని.. అయితే రోడ్డు దిగ్బంధం వంటి నిరసనలు మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకే జరుగుతాయని వెల్లడించారు. భారత్ బంద్‌ను శాంతియుతంగానే చేపట్టాలని తాము నిశ్చయించుకున్నట్టు స్పష్టం చేశారు.
కేంద్రం మార్గదర్శకాలు...
భారత్ బంద్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. కరోనా నిబంధనలను కూడా కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
విపక్షాల మద్దతు...
రైతుల 'భారత్ బంద్'కు 20 రాజకీయ పార్టీలు, 35 విద్యార్థి సంఘాలు, 5 కార్మిక సంఘాలు, 50 ట్రాన్స్ ఫోర్ట్ సంఘాల మద్దతు పలికాయి. తృణమూల్ కాంగ్రెస్ మినహా విపక్షాలు మద్దతు ప్రకటించాయి. రైతులకు అండగా ఉంటామని కాంగ్రెస్ వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో తమ పార్టీ శ్రేణులు నిరసనలు తెలుపుతారని స్పష్టం చేసింది. భారత్ బంద్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే అది భాజపా తప్పేనని పేర్కొంది.
- భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించింది డీఎంకే. తమిళనాడు ప్రభుత్వం రైతుల పోరాటాన్ని అడ్డుకుంటోందని మండిపడింది.
- కేంద్ర ప్రభుత్వం తన మొండివైఖరిని మానుకుని సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది.
- రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఇకనైనా వారికి న్యాయం చేయాలని తేల్చిచెప్పింది బీఎస్పీ. అన్నదాతల ఆందోళనకు తమ మద్దతుంటుందని స్పష్టం చేసింది.
- తెరాస, ఆప్, ఎస్పీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ కూడా భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.
- అన్నదాతలకు సంఘీభావం తెలిపింది తృణమూల్ కాంగ్రెస్. అయితే బంగాల్లో మాత్రం భారత్ బంద్‌కు మద్దతివ్వడం లేదని పేర్కొంది.
ఇదీ చూడండి:- సాగు చట్టాలపై విపక్షాలు గరం- భాజపా ఫైర్
'మార్కెట్లు తెరిచే ఉంటాయి..'
రైతులు ప్రకటించిన భారత్ బంద్‌కు వ్యతిరేకంగా సీఐఏటీ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్), ఏఐటీడబ్ల్యూఏ(ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్) కీలక నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం.. దిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లు తెరిచే ఉంటాయని, రవాణా సర్వీసులు కూడా నడుస్తాయని స్పష్టం చేశాయి.
రైతులకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘీభావం తెలిపారు. రైతన్నల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకు అన్నదాతలకు తమ మద్దతుంటుందని స్పష్టం చేసింది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్.
రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ పలు బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే ప్రకటన విడుదల చేశాయి. వీలైనంత త్వరగా చర్చలు జరిపి.. వారి సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించాయి.
ఇదీ చూడండి:- అఖిలేశ్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు