Farmers Protest: మరోసారి రైతు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రైతు సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్‌లో జాతీయ రైతు సంఘాల సమాఖ్య సమావేశమైంది. ఈ భేటీకి యునైటెడ్ కిసాన్ మోర్చాలో భాగంగా ఉన్న 80 మంది రైతుల సంఘాల నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై రైతు సంఘాల నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంపై కూడా వారు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
Farmer Leaders Meeting: పెండింగ్‌లో డిమాండ్లను ఆమోదించకుంటే గతంలో కంటే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాల నేతలు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, శివకుమార్ కక్కా హెచ్చరించారు. బుధవారం సింఘు సరిహద్దు ఉద్యమ స్థలం నుంచి లఖింపూర్ ఖేరీకి రైతు సంఘాల బృందం వెళ్లనుంది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కమిటీకి కోసం ముగ్గురి పేర్లను కోరడంపై కూడా రైతు సంఘాల నేతలు చర్చించారు.
సాగుచట్టాలను రద్దు చేయాలని 2020 నవంబర్‌లో దిల్లీ సరిహద్దులో పెద్దఎత్తున ఉద్యమం ప్రారంభించాయి రైతు సంఘాలు. కరోనా, చలిని లెక్కచేయకుండా ఏడాది పాటు నిరసనలు కొనసాగించాయి. చివరకు కేంద్రం వారి డిమాండ్‌కు దిగివచ్చింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ 2021 నవంబర్‌లో ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఇచ్చిన హామీల అమలు దిశగా కేంద్రం ఇంకా చర్యలు చేపట్టలేదని రైతు సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. అందుకే మరోసారి ఉద్యమానికి సిద్ధమవ్వాలని భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఒకే ప్రాంగణంలో హారతి, అజాన్.. వెల్లివిరిసిన మత సామరస్యం