సాగు చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రంపై విమర్శలు కురిపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో ఎక్కడైనా అపరిమితంగా పంట కొనుగోళ్లకు అనుమతిస్తే మండీలకు ఎవరు వెళ్తారని ప్రశ్నించారు. దీనికోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మండీలను అంతం చేయడానికేనని ధ్వజమెత్తారు. దేశ ఆహార భద్రత వ్యవస్థను నూతన చట్టాలు నాశనం చేస్తాయని ఆరోపించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇవి తీవ్రంగా దెబ్బతీస్తాయన్నారు.
"విపక్షాలు నిరసనలపైనే మాట్లాడుతున్నాయి తప్ప సాగు చట్టాల ఉద్దేశం గురించి కాదని మోదీ నిన్న పేర్కొన్నారు. కాబట్టి ఆయన్ను సంతోషపెట్టేందుకు సాగు చట్టాల గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలను దేశంలో ఎక్కడైనా అపరిమితంగా కొనుగోలు చేయవచ్చని మొదటి చట్టం చెబుతోంది. దేశంలో ప్రతిచోట అపరిమిత కొనుగోళ్లు జరిగితే మండీలకు ఎవరు వెళ్తారు? మొదటి చట్టం ఉద్దేశం మండీలను నాశనం చేయడం. రెండో చట్టంలో.. పెద్ద వ్యాపారులు ఆహార పదార్థాలను ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. ఇది అత్యవసర ఉత్పత్తుల చట్టాన్ని రద్దు చేస్తుంది. మూడో చట్టం వల్ల రైతులు వ్యాపారుల దగ్గరికి వెళ్లి తమ పంటకు సరైన ధర కోసం డిమాండ్ చేయాల్సి ఉంటుంది. న్యాయస్థానానికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. దేశంలోని పంటలన్నీ తన(మోదీ) మొదటి స్నేహితుడికి అప్పగించడం ఓ చట్టం ఉద్దేశమైతే... దేశంలోని 40 శాతం ఆహార ఉత్పత్తులను నిల్వ చేసే స్నేహితుడికి సాయం చేయడం రెండో చట్టం ఉద్దేశం. చివరకు నష్టపోయేది రైతులు, చిన్న వ్యాపారులే."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్నది రైతుల ఉద్యమం కాదని, దేశ ప్రజలందరిదని అన్నారు రాహుల్. రైతులు కేవలం మార్గదర్శనం చేస్తున్నారని చెప్పారు. సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 200 మందికి సంఘీభావంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని పిలుపునిచ్చారు. టీఎంసీ, డీఎంకే ఎంపీలు సైతం ఇందులో పాల్గొన్నారు. మరణించిన రైతులకు కేంద్రం సంతాపం ప్రకటించలేదని, అందుకే వారికి సంఘీభావంగా తాము మౌనం పాటించామని రాహుల్ తెలిపారు.
దేశాన్ని నలుగురు వ్యక్తులు మాత్రమే నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ. కుటుంబ నియంత్రణ నినాదమైన 'మనం ఇద్దరం-మనకు ఇద్దరు'ను ప్రస్తావిస్తూ.. మోదీ సర్కార్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ నలుగురి పేర్లు ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు.
ఇదీ చదవండి: 'ధనికుల కోసం, ధనికుల చేత, ధనికుల బడ్జెట్'