బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 28న తొలి దశ, ఈ నెల 3న రెండో దశ, శనివారం మూడో దశ పోలింగ్ నిర్వహించారు.
తుది దశలో..
తుది విడత ఎన్నికల్లో 57.58శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. తుది విడతలో 19 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. వాల్మీకీనగర్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక కూడా జరిగింది. చివరి విడత ఎన్నికల్లో సుమారు 12 వందల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బిహార్ స్పీకర్ విజయ్ కుమార్ చౌధురి సహా 12 మంది మంత్రులు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి యాదవ్ పోటీపడ్డారు.
ఉద్రిక్తత..
పూర్నియాలో ఓటర్లు ఓట్లు వేయకుండా కొందరు అడ్డుకోగా.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అరారియాలో జోకియాట్ ఆర్జేేడీ అభ్యర్థి చొక్కాకు పార్టీ గుర్తు బ్యాడ్జి వేసుకుని ఓటు వేయడానికి వచ్చారు. ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందున అభ్యర్థిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ ఇలా..
మూడో దశ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. టైమ్స్‌నౌ- సి ఓటర్, పీపుల్స్ పల్స్, ఏబీపీ న్యూస్, రిపబ్లిక్ జన్‌కీ బాత్ వంటి సంస్థలు మహా కూటమికి ఆధిక్యం కట్టబెట్టాయి. మహా కూటమికి 120, అధికార ఎన్డీయేకు 116 సీట్లు, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ- సి ఓటర్ పేర్కొంది. ఇక పీపుల్స్ పల్స్ సైతం మహా కూటమివైపే ఓటర్లు మొగ్గినట్లు చూపించింది. ఆ కూటమికి 100-115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీయేకు 90-110 స్థానాలు రావొచ్చని పేర్కొంది. ఎల్జేపీ 3-5, ఇతరులు 8-18 స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది. ఇక ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేజస్వి యాదవ్‌కు 44 శాతం మంది మద్దతు తెలపగా.. నీతీశ్ కుమార్‌కు 35 శాతం మద్దతు లభించింది. చిరాగ్ పాస్వాన్‌కు 7 శాతం మంది ఓటేశారు.
ఇతర సర్వేలు సైతం మహా కూటమికే ఆధిక్యం చూపించినప్పటికీ స్పష్టమైన మెజార్టీకి ఫలానా కూటమికే వస్తుందని పేర్కొనకపోవడం గమనార్హం. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఎల్జేపీ, ఇతరులు కీలకంగా మారొచ్చు. మొత్తం మూడు దశల్లో 243 స్థానాలకు గానూ బిహార్‌లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జేడీయూ, భాజపా ప్రధాన పార్టీలుగా ఉన్న ఎన్డీయే మరోసారి అధికారం దక్కించుకోవాలని భావిస్తుండగా.. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి ఏర్పడిన మహా కూటమి గట్టి పోటీనిస్తోంది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. తుది ఫలితాలు ఈ నెల 10న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి:- ఆ విషయంలో నితీశ్‌ను దాటేసిన తేజస్వీ