Vivekananda Reddy murder case investigation updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఈరోజు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. నేటి విచారణకు ఎర్ర గంగి రెడ్డి, సునీల్ యాదవ్‌తోపాటు ఉమాశంకర్ రెడ్డిలు హాజరయ్యారు. వివేకా హత్య కేసుపై విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణనూ ఈనెల 16వ తేదీకీ వాయిదా వేస్తూ ఉత్తుర్వులు జారీ చేశారు. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ గురువారం రోజున సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై కూడా ఈరోజు నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 5వ తేదీన చేపడతామని తెలియజేస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది.
బెయిల్ మంజూరు చేయండి..!.. వైఎస్ భాస్కర్ రెడ్డి విషయానికొస్తే.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున వైఎస్ భాస్కర్ రెడ్డి సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ సీబీఐ ఆయనను ఏప్రిల్ 16వ తేదీన పులివెందులలో అరెస్టు చేసి హైదరాబాద్‍కు తరలించింది. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి సీబీఐ.. తదనంతరం సీబీఐ కోర్టులో హాజరుపర్చగా భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి తనకు బెయిలు మంజూరు చేయాలంటూ.. సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలాలు చేశారు. ఆ పిటిషన్‌లో.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పాత్రకు సంబంధించి.. ఎటువంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు. సాక్ష్యాల చెరిపివేతలో తనకు ఎటువంటి సంబంధంలేదని భాస్కర్ రెడ్డి వివరించారు. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా సీబీఐ తనను అరెస్టు చేసి, అక్రమంగా నిర్బంధించిందని తెలిపారు. అంతేకాకుండా, తనకు వివిధ అనారోగ్య సమస్యలతో పాటు తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని పేర్కొన్నారు. దాదాపు 45 రోజులుగా జైలులో ఉంటున్నానని, ఇప్పటికే కస్టడీ విచారణ కూడా ముగిసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి పిటిషన్‌లో వివరించారు.
దస్తగిరి విచారణకు గైర్హాజరు.. నేటి వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి.. ముందుగా సీబీఐ అధికారులు ఉదయం 10 గంటలకు ఎర్ర గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితోపాటు భాస్కర్ రెడ్డిలను జైలు నుంచి సీబీఐ కోర్టుకు తరలించారు. విచారణ ముగిసిన వెంటనే సీబీఐ కోర్టు నుంచి వారిని మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి గత విచారణకు, నేటి విచారణకు గైర్హాజరయ్యారు. అంతేకాదు, ఇటీవలే వైఎస్ కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ దస్తగిరి పలుమార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి