దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో నిర్వహించిన కుంభమేళాలో కొవిడ్ కట్టడిలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. హరిద్వార్‌లో కుంభమేళాకు హాజరైన లక్ష మందికి పైగా భక్తులకు నకిలీ కొవిడ్ రిపోర్టులు జారీ అయ్యాయి. కొవిడ్ టెస్టుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న 'మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్' అనే ప్రైవేట్ ఏజెన్సీ ఈ వ్యవహారానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
అయితే, ఈ ప్రైవేటు ఏజెన్సీ తమ సంస్థ అధికారిక చిరునామాను నోయిడాగా పేర్కొంది. 'సీ-206, సెక్టార్ 63, నోడియా' అనే అడ్రెస్‌ను మాక్స్ కార్పొరేట్ సర్వీసెస్ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే, అసలు ఈ అడ్రెస్లో సంస్థకు సంబంధించిన కార్యాలయమేమీ లేదు. ఈటీవీ భారత్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


మరొక కార్పొరేట్ సంస్థ ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తోందని 'ఈటీవీ భారత్' గుర్తించింది. అక్కడ ఉన్న కొందరు ఉద్యోగులను ప్రశ్నించగా.. వారు కూడా ఇక్కడ అలాంటి కార్యాలయమేమీ లేదని బదులిచ్చారు. పదేళ్ల నుంచి తాము ఇక్కడ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదం గురించి వారికి వివరించిన తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకు తెలిసి ఆ భవన పరిసరాల్లో అలాంటి ల్యాబ్ లేదని స్పష్టంగా చెప్పారు.


వివాదం ఏంటంటే?
కుంభమేళా నిర్వహించేందుకు సిద్ధమైన ఉత్తరాఖండ్ సర్కారు.. భక్తులకు కొవిడ్ టెస్టులు చేయాలని నిర్ణయించుకొని, ఇందుకోసం ప్రైవేటు ల్యాబ్‌లను నియమించుకుంది. అయితే, ఈ ల్యాబ్‌లు నకిలీ కరోనా ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయని మీడియా కథనాల ద్వారా బయటపడింది.
దీంతో హరిద్వార్ జిల్లా యంత్రాంగం ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. అనేక ప్రైవేటు ల్యాబ్‌లు నకిలీ కొవిడ్ రిపోర్టులు జారీ చేశాయని ప్రాథమిక విచారణలో తేలింది. దాదాపు లక్షకు పైగా భక్తులకు ఇలాంటి బోగస్ నివేదికలు అందినట్లు వెల్లడైంది.
సర్కారు మాట
ఈ విషయంపై రాష్ట్ర వైద్య సంచాలకుడికి ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ తెలిపారు. చెల్లింపులు చేసే ముందు ల్యాబ్‌లను తనిఖీ చేయాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశించినట్లు చెప్పారు.
ఈ అంశంపై కేంద్ర కేంద్ర ఆరోగ్య శాఖ సైతం చర్చించినట్లు ఆ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే నకిలీ రిపోర్టుల సంఖ్య పూర్తిగా నిర్ధరణ కాలేదని చెప్పారు. మరో 7-8 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సవివర నివేదిక అందించనుందని చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయిలోనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: హబుల్ టెలిస్కోప్‌లో సాంకేతిక సమస్య