వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల కమిషనర్లతో భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర భేటీ అయ్యారు. ఎన్నికల ముందస్తు ప్రణాళికపై సమీక్షించారు.
గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మే నాటికి ప్రభుత్వాల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో.. కసరత్తు చేపట్టింది ఈసీ. బుధవారం జరిగిన ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఓటర్లకు రిజిస్ట్రేషన్ సౌలభ్యం, ఓటరు జాబితా, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పేపర్ ట్రైల్ మెషీన్ల ఏర్పాట్లు, 80 ఏళ్లుపైబడిన సీనియర్ సిటిజన్ల, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వంటి వివిధ అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు కొవిడ్ ఉపశమ ప్రణాళిక, ఎన్నికల సిబ్బందికి శిక్షణ వంటి పలు అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. నిష్పక్షపాతం, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించటమే తమ లక్ష్యమని సుశీల్ చంద్ర పేర్కొన్నారు. ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా సవాళ్లు ఉంటాయని.. వాటిని అధిగమించడానికి సరైన ప్రణాళిక అవసరమన్నారు. ఓటరు జాబితా ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఓటరు నమోదు కోసం పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సీఈఓలకు సూచించారు.
ఇదీ చూడండి: 'టీకా తీసుకునేలా మత, సంఘాల నేతలు ప్రోత్సహించాలి'