చిన్న చిన్న కారణాలతోనే ఘర్షణకు దిగి.. దాడులకు పాల్పడుతోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అలాంటి ఘటన బిహార్ కైమూర్ జిల్లా మోహనీయా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేవలం రూ.500 కోసం తమ్ముడిని కర్రతో కొట్టాడు ఓ అన్న. దాంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితుడిని ఖుషి శర్మగా గుర్తించారు.
నిందితుడు రాము పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తాను కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తన తమ్ముడు ఖుషి శర్మ మత్తుపదార్థాల కోసం తన వద్ద డబ్బులు తీసుకునేవాడని చెప్పాడు. మానేయాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికి వినలేదని తెలిపాడు. అయితే.. తాజాగా తనకు ఇచ్చిన రూ.500 ఇవ్వాలని కోరగా.. కోపంతో కర్రతో తమ్ముడిని కొట్టానని.. సోదరుడు మరణించిన విషయం కూడా తనకు తెలియదని వెల్లడించాడు.
మరోవైపు.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోందని గ్రామస్థులు తెలిపారు. అందుకోసం తమ్ముడిపై దాడి చేసి ఉంటాడని చెప్పారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడు మైనర్ అని తెలిపారు.
ఇదీ చూడండి: లిక్కర్‌కు రూ.50 ఇవ్వలేదని స్నేహితులను పొడిచిన బాలుడు