కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తాంగడి తాలూకాలోని 'ధర్మస్థల'.. మంజునాథ స్వామి ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం అధికారులు పర్యావరణహిత వాహనాలు రూపొందించారు. ఆటో, కారు వంటి వాహనాల ముందు భాగాన్ని తొలగించి ఎద్దులు లాగేలా రూపొందించిన ఈ వాహనాలు ప్రస్తుతం చూపరులను ఆకట్టుకుంటున్నాయి.


ఇంధనం అవసరం లేని ఈ పర్యావరణహిత వాహనాలు సమీప గిడ్డంగుల్లో నుంచి మంజునాథ ఆలయ ఆరాధన వస్తువులను తేవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ వాహన రూపకల్పనలో ధర్మస్థల మంజుషా కార్ మ్యూజియం సిబ్బందితో పాటు, పాలిటెక్నిక్ విద్యార్థులు తమ తోడ్పాటును అందించారు.
ఈ వాహనాలకు బ్రేకులు సైతం ఏర్పాటు చేయగా.. వీటిని ఒంగోల్ జాతి ఎద్దులు లాగటం మరో విశేషం. వీటిలో ప్రయాణం భిన్నమైన అనుభూతిని ఇస్తుందంటున్నారు భక్తులు.


ఆలయ పవిత్రత ఇనుమడించేలా...
దేవాలయాల పవిత్రతను మరింత పెంచడానికి వీటిని రూపొందించామని ధర్మస్థల ఆలయ అధికారి డాక్టర్ డీ వీరేంద్ర హెగ్డే అన్నారు. ఆయన పర్యావరణ అనుకూల ఆలోచనలకు తోడు.. ధర్మస్థల ఆధ్వర్యంలో నడిచే మంజుషా కార్ మ్యూజియాన్ని నిర్వహించే డాక్టర్ దివాకర్, హర్షేంద్ర కుమార్లు వీటి కోసం కృషి చేశారు. వీరి కృషితో పర్యావరణహిత ఎద్దు ఆటో, కారు మోడళ్లు రూపుదిద్దుకొన్నాయి.
పాడైపోయిన వాహనాలను తిరిగి ఉపయోగంలోకి తేవడానికి ఆలయ అధికారులు చేసిన వినూత్న ప్రయోగానికి భక్తులు ఫిదా అవుతున్నారు. ఈ వాహనాలను తమ మొబైల్ ఫోన్లలో బంధిస్తూ అబ్బురపడుతున్నారు.
ఇదీ చదవండి: ఔరా! గులకరాళ్లతో అద్భుత కళాఖండాలు