Russian Foreign Minister Lavrov: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తటస్థ వైఖరి అనుసరిస్తున్న వేళ భారత పర్యటనకు విచ్చేసిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. వివాదాలను భారత్ ఎల్లప్పుడూ చర్చల ద్వారా పరిష్కరించుకోడంపై మొగ్గు చూపుతుందని ఈ సందర్భంగా జైశంకర్ స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం కాకుండా క్లిష్టమైన అంతర్జాతీయ వాతావరణ పరిస్థితుల మధ్య భారత్, రష్యా మధ్య విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందని అన్నారు. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు అనేక రంగాల్లో క్రమంగా వృద్ధి చెందుతున్నాయని జైశంకర్ తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌కు పరస్పర సహకారం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్ అన్నారు. రష్యా నుంచి భారత్ ఏం కొనాలనుకున్నా.. వాటిని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
![Russian Foreign Minister Lavrov](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14898894_lavrov.jpg)
"భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది. భారత విదేశీ విధానాలు స్వతంత్రమైనవి. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని రష్యా విశ్వసిస్తోంది. రష్యా సమాఖ్య కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది. అందుకే ఈ రెండు దేశాలు అనేక అంశాల్లో వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. రక్షణ రంగంలో భారత్‌కు మా సహకారం కొనసాగిస్తాం. రష్యా నుంచి భారత్ ఎలాంటి ఉత్పత్తులు కొనుగోలు చేయాలన్నా వాటిపై చర్చించి, సరఫరా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం"
- సెర్గీ లావ్రోస్, రష్యా విదేశాంగ మంత్రి.
అమెరికాపై పరోక్ష విమర్శలు: ఈ సందర్భంగా అమెరికా ఆంక్షలపైన లవ్రోస్ మాట్లాడారు. "భారత్-రష్యా భాగస్వామ్యంపై ఎవరి ఒత్తిడి ప్రభావం చూపించదు. వారు(అమెరికాను ఉద్దేశిస్తూ) తమ రాజకీయాలను అనుసరించమని ఇతరులను బలవంత పెడుతున్నారు" అని విమర్శించారు. ఇక ఉక్రెయిన్‌పై దండయాత్ర గురించి స్పందిస్తూ.. " అది యుద్ధం కాదు. ఒక ప్రత్యేక ఆపరేషన్ మాత్రమే. రష్యాకు కీవ్ నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూసుకోవడమే మా ప్రధాన లక్ష్యం. త్వరలోనే ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాం" అని వ్యాఖ్యానించారు.
ప్రధానికి పుతిన్ వ్యక్తిగత సందేశం: పర్యటనలో భాగంగా సెర్గీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ భేటీ కానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పంపిన సందేశాన్ని వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటున్నట్లు లవ్రోస్ తెలిపారు. " పుతిన్, మోదీ నిరంతరం టచ్‌లోనే ఉంటారు. నేను నా చర్చల గురించి పుతిన్‌కు నివేదిస్తాను. పుతిన్ పంపిన వ్యక్తిగత సందేశాన్ని ప్రధాని మోదీకి చెప్పే అవకాశం రావడం ఆనందంగా ఉంది" అని ఆయన చెప్పుకొచ్చారు.
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న దండయాత్ర విషయంలో భారత్ అవలంబిస్తోన్న తటస్థ వైఖరిపై అమెరికా వంటి దేశాల నుంచి విమర్శలు వ్యక్తమవుతోన్న సెర్గీ లవ్రోస్ దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ దేశాల ఆంక్షలతో సతమతమవుతోన్న రష్యా తమ చమురు ఎగుమతులను పెంచుకునేందుకు భారత్‌కు డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా లవ్రోస్ జైశంకర్ భేటీలోనూ ఈ చౌక చమురు సరఫరాపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
రెండు రోజుల పర్యటన: చైనాలో పర్యటన ముగించుకుని గురువారం దిల్లీ చేరుకున్నారు సెర్గీ లావ్రోవ్. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం భేటీ కానున్నారు. రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. సెర్గీ భారత్‌కు వచ్చే కొన్ని గంటల ముందే అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దిలీప్ సింగ్.. పలు హెచ్చరికలు చేయటం గమనార్హం. మాస్కోపై అమెరికా విధించిన ఆంక్షలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్న దేశాలు వాటి పర్యవసనాలను ఎదుర్కోక తప్పదంటూ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి.. అమెరికా తీవ్ర హెచ్చరిక