DRDO Building: భారత రక్షణ పరిశోధన సంస్థ(DRDO) బహుళ అంతస్తుల భవనాన్ని అత్యంత వేగంగా నిర్మించింది. 45 రోజుల్లోనే ఏడు అంతస్తులతో అద్భుతంగా దీన్ని రూపొందించింది. బెంగళూరులోని ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో విమాన నియంత్రణ వ్యవస్థ కేంద్రంగా ఉపయోగించేందుకు ఈ భవనాన్ని తీర్చిదిద్దింది.
ఈ భవనాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఆయనతో పాటు ఉన్నారు.
ప్రత్యేకతలు..
ఈ ఏడు అంతస్తుల భవనం మొత్తం వైశాల్యం 1.3 లక్షల చదరపు అడుగులు. భారత వైమానిక దళం కోసం ఐదో తరం మధ్యస్థ బరువు గల డీప్ పెనెట్రేషన్ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడానికి ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. అందుకు అవసరమైన సకల సౌకర్యాలు ఉంటాయి. అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ కోసం యుద్ధ విమానాలు, విమాన నియంత్రణ వ్యవస్థ(FCS) కోసం ఏవియానిక్స్ అభివృద్ధి చేయడానికి ఈ కాంప్లెక్స్‌లో సదుపాయాలు ఉంటాయని అధికారులు చెప్పారు.
వైమానిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(AMCA) ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది భారత్. దీని అంచనా రూ.15,000 కోట్లు. ఏఎంసీఏ రూపకల్పన, నమూనా అభివృద్ధికి ప్రధానమంత్రి నేతృత్వంలో భద్రతపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ నుంచి ఆమోదం పొందే ప్రక్రియను ప్రారంభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
కాంపోజిట్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి భవనాన్ని తక్కువ వ్యవధిలోనే నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 2021 నవంబర్ 22న శంకుస్థాపన జరగ్గా.. నిర్మాణ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైంది. హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో శాశ్వత ఏడు అంతస్తుల భవనాన్ని పూర్తి చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని ఈ ప్రాజెక్టులో భాగమైన అధికారి ఒకరు తెలిపారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ దీనికి సాంకేతిక సహకారం అందించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పుట్టిన బిడ్డను భూమిలో పాతేసిన తల్లి... శిశువు ఏడుపు విని..