దీపావళికి అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఐదు శతాబ్దాల తర్వాత ఖగోళంలో అనూహ్య పరిణామం చోటుచేసుకోనుంది. రెండు ప్రధాన గ్రహాలు తమ సొంత రాశిలో ప్రవేశించనున్నాయి. జోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి ధనస్సు రాశిలో, శనిగ్రహం మకర రాశిలోకి వెళ్లనున్నాయి. 1521 సంవత్సరం(499 ఏళ్ల) తర్వాత తొలిసారి ఇలా జరగబోతుంది.
బృహస్పతి, శని తమ సొంత రాశుల్లో ఉండటం ద్వారా ఆ రాశుల్లోని ఇతర వ్యక్తులకూ మంచి జరుగుతుందని జోతిషులు చెబుతున్నారు.
"నక్షత్రరాశుల మహాసయోగం నవంబర్ 13న ప్రారంభమవుతుంది. సరిగ్గా 499 ఏళ్ల తర్వాత ఇదే రోజు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. అయోధ్యలోని శ్రీరామ మందిర స్థలంలో దీపాలు వెలిగిస్తారు. ఇది అరుదైన రోజు. దీనివల్ల ప్రపంచంలోని సనాతనులందరికీ చాలా మంచి జరుగుతుంది. వృషభం, కర్కాటకం, తుల, కుంభ రాశి వారికి ఈ దీపావళి సన్మార్గాన్ని చూపిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు, వాహనాల కొనుగోలుకు నవంబర్ 11 నుంచి 14 మధ్య ఉన్న ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి."
-పండిత్ కల్కిరామ్, రామ్దయాళ్ ట్రస్ట్ అధ్యక్షుడు
ఈ రోజున లక్ష్మీ, గణపతికి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు హనుమంతుడు, యమధర్మరాజు, చిత్ర గుప్తుడు, కుబేరుడు, భైరవుడితో పాటు పూర్వీకులను పూజిస్తే శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.