దేశం చలికి వణుకుతోంది. ఉత్తరాదిలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి ప్రజలు గజగజలాడుతున్నారు. ప్రజలంతా శీతలగాలుల నుంచి రక్షణకు ఊలు దుస్తుల్ని, చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మనతో పాటు దేవుడికి కూడా చలేస్తుంది కదా! అని ఆలోచిస్తున్నారు భక్తులు, పూజారులు. కాశీలోని విశ్వనాథ్ దేవాలయం సహా మరికొన్ని ఆలయాల్లో దేవతామూర్తులకు చలేయకుండా వెచ్చని దుస్తులతో కప్పి ఉంచారు.
వారణాసిలో ఇలా దేవతామూర్తులకు దుప్పట్లు కప్పే సంప్రదాయం దాదాపు వెయ్యేళ్ల నుంచి ఉంది. కాశీ విశ్వనాథ్, గోడీయ మఠం, చింతామణి గణేశ్, బారా గణేశ్ దేవాలయాల్లోని విగ్రహమూర్తులకు సంప్రదాయ దుస్తులను కప్పి ఉంచారు.


"భగవంతుడు భక్తులకు రక్షణగా ఉంటాడు. అలాగే భక్తులు కూడా భగవంతుడికి రక్షణగా దుప్పట్లు, శాలువాలు, వెచ్చని దుస్తులతో కప్పుతున్నారు" అని పూజారి విభూతి నారాయణ్ శుక్లా తెలిపారు. అలాగే వేడినీళ్లతో స్నానం చేయించడం, నైవేద్యాలు పెట్టడం, ఆలయంలో హీటర్లు వంటివి పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
