Devaragattu Banni Festival Celebrations : కర్నూలు జిల్లా దేవరగట్టులో ఇవాళ అర్ధరాత్రి కర్రల సమరం జరగనుంది. పండుగ తేదీలపై తర్జనభర్జన పడిన అనంతరం మంగళవారం విజయదశమిగా నిర్ణయించారు. విజయదశమి సందర్భంగా జరిగే కర్రల సమయంలో హింసకు తావు లేకుండా బన్నీ ఉత్సవాన్ని నిర్వహించాలని అధికారులు చర్యలు చేపట్టారు.
Devaragattu Traditional Stick Fight Festival Video : ఆలూరు నియోజకవర్గంలో కర్రల సమరాన్ని అనాదిగా జరుపుకుంటున్నారు. హొలగుంద మండలం దేవరగట్టులో.. ఏటా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు గ్రామం వద్ద.. కొండపై మాళ మల్లేశ్వర స్వామి ఆలయం వెలసింది. ఈ గుడిలోని దేవతామూర్తులైన.. మాళమ్మ, మల్లేశ్వర స్వామికి దసరా పర్వదినాన అర్ధరాత్రి పన్నెండు గంటలకు కల్యాణం జరిపిస్తారు.
అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి ఉత్సవ విగ్రహాల ముందు కర్రలతో తలపడతారు. దీనినే బన్నీ ఉత్సవం అని కూడా పిలుస్తారు.
stick fight festival: దేవరగట్టు కర్రల సమరంలో మళ్లీ చిందిన రక్తం....
బన్నీ ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? : మాళమ్మ, మల్లేశ్వర స్వామి వార్లు రాక్షస సంహారం చేసిన తర్వాత బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. తమ ఇలవేల్పు దైవాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా.. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడతారు. అర్ధరాత్రి కారు చీకట్లో కర్రలు.. దివిటీలతో గుంపులు గుంపులుగా జరిగే కర్రల సమరానికి పెట్టింది పేరు.
గగుర్పాటు కలిగించే పండుగ : ఈ బన్నీ ఉత్సవంలో జరిగే దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది వస్తారు. దాదాపు 800 అడుగుల ఎత్తైన కొండల్లో వెలసిన మాలమల్లేశ్వర స్వామి వద్ద బన్నీ ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు కర్రలు ధరించి.. కాగడాల వెళుతురులో నిర్వహించే ఊరేగింపు కొన్నిసార్లు గగుర్పాటు కలిగిస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి జరిగే ప్రధాన ఘట్టం జైత్ర యాత్ర. వేలాది మంది భక్తులు కర్రలు చేత పట్టుకుని కాగడాల వెళుతురులో జైత్రయాత్రలో పాల్గొంటారు. ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడే దృశ్యాలు కనువిందు చేస్తాయి.
ఆంక్షలున్నా...ఆగని బన్నీ ఉత్సవం
స్థానికుల దృష్టిలో వినోద క్రీడ : కర్రలు చేత ధరించి ఒకరకమైన "డిర్ర్.ర్ర్.ర్ర్.ర్ర్...గోపరాక్ .. బహు పరాక్ .." అను శబ్దం చేస్తూ వెళ్లే దృశ్యాలు.. ఒకరినొకరు కొట్టుకుంటున్నట్లు కనిపిస్తాయి. "స్వామి మాకే దక్కాలి కాదు.. మాకేనంటూ" 8 గ్రామాల ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి విచక్షణా రహితంగా కర్రలతో కొట్టుకోవడం అనేది స్థానికుల దృష్టిలో వినోద క్రీడ. ఇందులో ఇరువర్గాలవారు తీవ్రంగా గాయపడతారు. ఇదే ఆచారం అనాదిగా వస్తోంది. ఇప్పటికీ కొనసాగుతోంది.
దీనిని తిలకించేందుకు కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు సాయంత్రమే తరలి వచ్చి కొండలపై కాస్త జాగా దక్కించుకుని తెల్లవార్లు జాగరణ చేసి మరీ ఉత్సవాలను తిలకిస్తారు. ఈ ఉత్సవ ఏర్పాట్ల కోసం కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఆదేశించారు.
పోలీసులు పటిష్ట ఏర్పాట్లు : బన్నీ ఉత్సవంలో హింసకు తావు లేకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే గ్రామాల్లో రింగులు తొడిగిన కర్రలను స్వాధీనం చేసుకుంటున్నారు. మద్యాన్ని నియంత్రించేందుకు తనిఖీలు చేపట్టారు. బాడీ ఒన్ కెమెరాలు, మఫ్టీ పోలీసు బృందాలతో నిఘాను పటిష్టం చేశారు. 100 కెమెరాలు, 1000 మందికిపైగా పోలీసులు, 2 పటాన్లు ప్రత్యేక బలగాలు, డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు.
మండిపడుతున్న ప్రజాసంఘాలు : బన్నీ ఉత్సవాల్లో హింసను అరికట్టాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండాపోతోంది. అధికారులే దగ్గరుండి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి అనాగరిక ఉత్సవాలను అరికట్టాలని కోరుతున్నారు.