దేశ రాజధాని దిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ(25)ను కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడో దుండగుడు. శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఆమె మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
ఇదీ జరిగింది..
వాయవ్య దిల్లీలోని ఆదర్శ్ నగర్లో ఓ గొలుసు దొంగ.. మహిళ మెడలోని చైన్‌ను దొంగిలించడానికి యత్నించాడు. ప్రతిఘటించిన ఆమెపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రగాయాలపాలైన ఆమె మృతిచెందింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
2 రోజుల్లో రెండోది..
గత రెండు రోజుల్లో అక్కడ ఈ తరహా ఘటనలు వెలుగు చూడటం ఇది రెండోసారి. అంతకుముందు.. కల్కాజీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు తన సోదరి వెంటపడి, అసభ్యకరంగా మాట్లాడగా.. 17ఏళ్ల బాలుడు తిరగబడ్డాడు. దీంతో అతడిపై కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం బాధితుడు ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్ చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇదీ చదవండి: నిర్మాణ ప్రదేశంలో 11 అడుగుల మొసలి