కరోనా నుంచి కోలుకున్న వారిలో కనిపిస్తున్న 'బ్లాక్ ఫంగస్' చికిత్సకు అవసరమయ్యే ఔషధాల ఉత్పత్తి, దిగుమతి కోసం తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ముఖ్యంగా ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బీ ఔషధాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రానికి సూచించింది.
ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించి దేశంలో తీవ్ర ఔషధ కొరత ఉన్న నేపథ్యంలో.. ఉత్పత్తి, దిగుమతి కోసం తీసుకుంటున్న చర్యలు, లైసెన్స్ పొందిన ఉత్పత్తిదారుల వివరాలను సమర్పించాలని జస్టిస్ విపిన్ సంఘీ, జస్మీత్ సింగ్‌ల ధర్మాసనం ఆదేశించింది.
దిల్లీలో సుమారు బ్లాక్ ఫంగస్(మ్యూకర్మైకోసిస్) 200 కేసులు ఉన్నాయని కోర్టుకు తెలిపింది కేంద్రం.
'ఆక్సిజన్ నిల్వలు తగ్గకుండా చూసుకోండి..'
కరోనా కేసులను అంత తేలికగా తీసుకోవద్దని.. వైరస్ తీవ్రత మళ్లీ పెరగొచ్చని దిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశాలు లేకపోలేదని.. తగినంత నిల్వలతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆక్సిజన్ లభ్యతకు తగిన చర్యలు తీసుకునే వరకు చెబుతూనే ఉండాల్సి వస్తుందని.. ఈ సమస్యను తేలికగా తీసుకోవద్దని కేంద్రాన్ని హెచ్చరించింది.
డోర్-టూ-డోర్ వ్యాక్సినేషన్‌పై..
మరోవైపు... ఇంటింటికీ వెళ్లి కరోనా టీకా పంపిణీ చేసే అంశంపై పునరాలోచించాలని బొంబాయి హైకోర్టు కేంద్రానికి సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల కోసమైనా ఇంటింటికీ వెళ్లి కరోనా టీకా అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ జీ.ఎస్ కులకర్ణి సూచించారు. ప్రస్తుతం టీకా కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఈ అంశంపై తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: దేశంలో మరో కొత్త వ్యాధి.. ఈసారి వైట్ ఫంగస్