దిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న ఆయన.. గురువారం ఉదయం జైలు గదిలోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆయన్ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి విషమించగా నగరంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
"జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్.. సెంట్రల్ జైలు నంబర్-7లోని గదిలో గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జారి పడ్డారు. మొదట సాధారణ బలహీనతగా భావించి ఆయన్ను జనరల్ అబ్జర్వేషన్లో ఉంచాము. క్రమంగా పరిస్థితి విషమించి.. జైన్ వెన్నుముక, ఎడమ కాలు, భుజంలో నొప్పి రావటం వల్ల వైద్యుల సూచన మేరకు ఆయన్ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లాము"
--జైలు సీనియర్ అధికారి.
దేవుడు అన్ని చూస్తున్నాడు : కేజ్రీవాల్
దిల్లీ మాజీ మంత్రికి గాయాలు కావడంపై ఆప్ విచారం వ్యక్తం చేసింది. 'సత్యేందర్ జైన్‌కు ఇలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవటానికి ఆ భగవంతుడు తగినంత శక్తిని ఇవ్వాలి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రజలకు నాణ్యమైన వైద్యం, మంచి విద్య అందించేందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తిని శిక్షిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తమ మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అన్నింటిని దేవుడు గమనిస్తున్నాడు. తప్పకుండా ఆయన త్వరలోనే అందరికి న్యాయం చేస్తాడు' అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. మరోవైపు సత్యేందర్ జైన్ గత సోమవారం కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు జైన్ పూర్తిగా నీరసించినట్లు కనిపించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలపై ఆప్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ కేసు
మనీలాండరింగ్ కేసులో గతేడాది మేలో సత్యేందర్ జైన్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఈయన జైలు అధికారులతో మర్యాదలు చేయించుకున్నట్లు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అయితే జైలులో జైన్‌కు సకల సౌకర్యాలు అందుతుండటంపై బీజేపీ అప్పట్లో విమర్శలు గుప్పించింది. కాగా, ఈ విమర్శలను ఆప్ కొట్టిపారేస్తూ.. ఫిజియోథెరపీలో భాగంగానే సత్యేందర్ జైన్‌కు మసాజ్ చేశారని వివరణ ఇచ్చింది. కాగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సత్యేందర్ జైన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.