కన్నతల్లినే చంపేసిన ఓ మహిళ.. ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ దారుణ ఘటన కర్ణాటక బెంగళూరులోని మికో లే అవుట్ పరిధిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని 70 ఏళ్ల బీవా పాల్గా గుర్తించారు పోలీసులు.
ఇదీ జరిగింది
బంగాల్‌కు చెందిన 39 ఏళ్ల సెనాలి సేన్ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె.. తన భర్త, అత్త, తల్లితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఇటీవల తన తండ్రి మరణించడం వల్ల తల్లి బీవా పాల్‌ను ఇంటికి తీసుకువచ్చి ఆమె బాగోగులు చూసుకుంటోంది. అయితే, సోమవారం తన తల్లితో గొడవపడిన సెనాలి.. ఆగ్రహంతో ఆమెను చంపేసింది. అనంతరం ఓ క్యాబ్ బుక్ చేసి ఆమె మృతదేహాన్ని ఓ ట్రాలీ సూట్‌కేస్‌లో కుక్కి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
సెనాలిని చూసి పోలీసులు కంగుతిన్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి ప్రశ్నించారు. తల్లి తనతో తరచూ గొడవ పడుతోందని అందుకే ఆమెను చంపేసినట్లు సెనాలి పోలీసుల ఎదుట అంగీకరించింది. ఆహారంలో నిద్రమాత్రలు ఇచ్చినట్లు తెలిపింది. ఆ ఆహారం తిని ఇబ్బంది పడుతున్న ఆమెను.. గొంతునులిమి చంపినట్లు సెనాలి వెల్లడించింది. ఘటన సమయంలో తన భర్త ఇంట్లో లేడని.. అత్త ఇంట్లోనే ఉన్నా ఆమెకు ఈ విషయం గురించి తెలియదని సెనాలీ చెప్పింది.
ఈత కొడుతూ ఐఐటీ ప్రొఫెసర్ మృతి
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఐఐటీలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమానాస్పద రీతిలో మరణించారు. సహోద్యోగులతో ఈత కొడుతుండగా అకస్మాత్తుగా చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఒడిశాకు చెందిన యశ్వంత్ ఉజాలా ధన్‌బాద్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం కళాశాల ప్రాంగణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో సహోద్యోగులతో కలిసి ఈత కొడుతున్నారు. ఈ క్రమంలోనే స్విమ్మింగ్ పూల్‌లో దూకిన యశ్వంత్.. బయటకు రాలేదు. అప్రమత్తమైన సహోద్యోగులు.. అడుగు భాగంలో ఉన్న యశ్వంత్‌ను బయటకు తీశారు. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. యశ్వంత్ మృతితో కళాశాలలో జరగనున్న పలు కార్యక్రమాలను రద్దు చేసింది యాజమాన్యం.
9 ఏళ్ల చిన్నారి గొంతుకోసి చంపిన తల్లి
9 ఏళ్ల చిన్నారి గొంతుకోసి చంపింది ఓ తల్లి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌లో మంగళవారం జరిగింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియాంక ఓజా అనే మహిళ తన కూతురు గొంతును కత్తితో కోసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. దీనిపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళను అదుపులోకి తీసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం తరలించామని చెప్పారు.
ఇవీ చదవండి : నాలుగేళ్ల చిన్నారి కళ్లు పీకేసి సజీవ దహనం.. క్షుద్రపూజలే కారణం!
'ఇదే మా చివరి పాట'.. మరణంలోనూ వీడని స్నేహం.. సరదాగా ఆడిపాడిన కొన్ని నిమిషాలకే..