కరోనాను గుర్తించేలా పార్లమెంట్లో వాయు, మురుగునీటి నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్'(సీఎస్ఐఆర్) సూచించింది. ఇందుకు సంబంధించి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ముందు ఓ ప్రెసెంటేషన్ ఇచ్చింది.
మురుగునీటి నిఘా వ్యవస్థ ద్వారా ఎంత మందికి కరోనా సోకిందనే విషయంపై ఓ అవగాహనకు రావొచ్చని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సీ మండే పేర్కొన్నారు. భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కానప్పుడు, సమూహాలలో వైరస్ ప్రభావాన్ని వాస్తవ సమయంలో గుర్తించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. హైదరాబాద్, అలహాబాద్, దిల్లీ, కోల్‌కతా, ముంబయి, నాగ్‌పుర్, పుదుచ్ఛేరి, చెన్నై నగరాల్లో ఈ వ్యవస్థ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని తన ప్రెసెంటేషన్లో వివరించారు.
ప్రస్తుత వైరస్ ధోరణిని తెలుసుకోవడమే కాకుండా.. భవిష్యత్ వ్యాప్తిని గుర్తించేందుకూ ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు మండే. ఇన్ఫెక్షన్ ముప్పును గుర్తించేందుకు 'గాలి నమూనా వ్యవస్థ'ను నెలకొల్పాలని సూచించారు.
ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కలిసి చర్చిస్తానని వెంకయ్య తెలిపారు.
ఇదీ చదవండి: గుప్త నిధుల కోసం వేట- ఊపిరాడక ఇద్దరు మృతి