కశ్మీర్ నుంచి సెలవులపై ఇంటికి వెళ్లే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) జవాన్లకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటుచేసింది కేంద్రం. ఎంఐ-17 హెలికాఫ్టర్ ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చాలని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలను నివారించడం సహా.. ఐఈడీ దాడుల నుంచి జవాన్లకు రక్షణ కల్పించేందుకు ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.
కాన్వాయ్‌లో ప్రయాణించడం ద్వారా.. మాగ్నెటిక్ ఐఈడీ, ఆర్‌సీఈఈడీల ముప్పు పొంచి ఉన్నట్టు ఇన్స్పెక్టర్ జనరల్ లేఖ ద్వారా తెలిపారు. ఈ దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఎంఐ-17 హెలికాఫ్టర్ ద్వారా జవాన్లను ఇంటికి చేర్చాలని కోరినట్టు చెప్పారు. ఈ మేరకు జవాన్లు తమ పైఅధికారులకు సమాచరం ఇవ్వడం సహా.. ప్రయాణం కోసం కనీసం ఒక రోజు ముందే దరఖాస్తు చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
"ఇది చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశం. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పుల్వామా ఘటన జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. తాజా ఆదేశాల ప్రకారం.. ప్రస్తుతం జవాన్లు, అధికారులు వారంలో మూడుసార్లు బీఎస్‌ఎఫ్ ఎంఐ-17 ద్వారా ఇళ్లకు వెళ్లవచ్చు. ఐఈడీల వంటి ముప్పు కూడా లేదు."
- సీఆర్పీఎప్ సీనియర్ అధికారి
అయితే.. ఈ హెలికాప్టర్.. జవాన్లను ఎక్కడి వరకు తీసుకెళ్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆ అధికారి చెప్పారు. కానీ.. జవాన్లు ఉండే స్థానం నుంచి జమ్ము లేదా శ్రీనగర్ విమానాశ్రయం వరకు చేరేవేసే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు.
2019 ఫిబ్రవరి 14న దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై పాక్ ఉగ్రసంస్థ దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు.
ఇదీ చదవండి: చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు పదార్థాల కలకలం