కరోనా టీకాల కోసం కొత్తగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్ల నమోదుకు అనుమతించొద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం శనివారం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ విభాగం కింద అనర్హులైన కొందరు వ్యక్తుల పేర్లు వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన జాబితాలో నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం లేఖ రాశారు. ఈ జాబితా కింద కొన్ని రోజులుగా ఉన్న డేటాబేస్లో అనూహ్యంగా 24శాతం పెరుగుదల కనిపించిందని ఆయన వెల్లడించారు.
ఇప్పటికే నమోదైన ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలని లేఖలో రాజేశ్ పేర్కొన్నారు. 45 ఏళ్లు దాటిన వారందరినీ కొవిన్ పోర్టల్ ద్వారా నమోదుకు అనుమతించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: టీకా పంపిణీలో 7 కోట్ల మైలురాయిని దాటిన భారత్