Corona cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కేరళలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 51,739 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58.26 లక్షలు దాటింది. మరో 68 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 52,343కి పెరిగింది.
రికవరీలే ఎక్కువ..
కర్ణాటకలో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చుకుంటే భారీగా తగ్గాయి. తాజాగా 38,083 కేసులు వెలుగుచూశాయి. మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 67,236 మంది వైరస్‌ను జయించారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,28,711కు చేరింది. పాజిటివిటీ రేటు 20.44కు చేరింది.
బెంగళూరులో ఒక్క రోజే 185 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. ఫలితంగా నగరంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,115కు చేరింది.
మహా తగ్గిన కేసులు
మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. కొత్తగా 25,425 మందికి వైరస్ సోకగా.. 42 మంది మరణించారు. 36,708 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు చేరింది.
తమిళనాడులో విద్యాసంస్థలు ప్రారంభం..
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ఆంక్షల్ని సడలించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక తరగతులు పునః ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసినట్లు స్పష్టం చేసింది. వివాహ వేడుకలకు 100 మంది, అంత్యక్రియలకు 50మందికి మించరాదని నిబంధన విధించింది.
ప్రార్థనా స్థలాలు అన్ని రోజుల్లోనూ తెరిచే ఉంటాయని స్పష్టంచేసింది. రెస్టారెంట్లు, సెలూన్లు, సినిమా థియేటర్లు, జిమ్‌లు, యోగా సెంటర్లకు మాత్రం 50శాతం ఆక్యుపెన్సీతోనే నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 28,515 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 53 మంది చనిపోయారు.
దిల్లీలో ఆంక్షలు సడలింపు
దిల్లీలో కరోనా కేసుల సంఖ్యంగా గణనీయంగా తగ్గింది. తాజాగా 4,921 కేసులు బయటపడగా.. మరో 34 మంది మరణించారు. 9,397 మంది వైరస్‌ను జయించారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 33,175కు తగ్గింది. పాజిటివిటీ రేటు 9.56 శాతానికి చేరింది.
ఈ నేపథ్యంలోనే వైరస్ కట్టడి కోసం విధించిన ఆంక్షలను ఆప్ సర్కారు సడలించింది. వారాంతపు కర్ఫ్యూతో పాటు, దుకాణాలపై సరి-బేసి విధానాన్ని ఎత్తివేసింది. సినిమా హాళ్లు, రెస్టారంట్లు 50 శాతం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది.
వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు
రాష్ట్రం | కొత్త కేసులు | కొత్త మరణాలు |
కేరళ | 51,739 | 68 |
కర్ణాటక | 38,083 | 49 |
తమిళనాడు | 28,515 | 53 |
మహారాష్ట్ర | 25,425 | 42 |
ఆంధ్రప్రదేశ్ | 13,374 | -- |
గుజరాత్ | 12,911 | 22 |
మధ్యప్రదేశ్ | 9,532 | 06 |
ఒడిశా | 5,901 | 08 |
జమ్ముకశ్మీర్ | 4,959 | 07 |
దిల్లీ | 4,291 | 34 |
తెలంగాణ | 3,944 | 03 |
అసోం | 3,677 | 20 |
బంగాల్ | 3,608 | 36 |
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: నగ్న వీడియోతో యువతి బెదిరింపు- ఇంజినీర్ ఆత్మహత్య