Congress President Election : దేశవ్యాప్తంగా వరుస ఓటములు.. సీనియర్లు, కీలక నేతల రాజీనామాలతో ఎట్టకేలకు నిద్రలేచిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తోంది. వచ్చే నెలలో ఏఐసీసీ పీఠానికి జరగనున్న ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్టీ ప్రాబల్యం రోజురోజుకూ తగ్గుతున్న నేపథ్యంలో సరైన అభ్యర్థి కోసం హస్తం శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.
1998 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘ కాలం సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. 2017లో రాహుల్‌కు బాధ్యతలు అప్పగించినా.. 2019లో తప్పుకుని మళ్లీ సోనియాకే కట్టబెట్టారు. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించి 19న కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన గెహ్లోత్.. అధ్యక్ష పదవి చేపట్టాలని రాహుల్‌ను ఒప్పిస్తామన్నారు. సోనియాగాంధీతో కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ‌్యక్ష ఎన్నికల్లో పోటీ కోసమే ఆయన భేటీ అయ్యారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల్లో తటస్థంగా ఉంటానని ఎక్కువమంది పోటీ చేయడాన్ని ఆహ్వానిస్తానని సోనియా చెప్పినట్లు హస్తం శ్రేణులు తెలిపాయి.
కాంగ్రెస్‌లో సంస్కరణల కోసం కొన్నేళ్లుగా ఒత్తిడి చేస్తున్న జీ-23 సీనియర్ నేతల్లో థరూర్ ఉండటం గమనార్హం. కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో సంస్కరణలు తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేయాలని 650 సంతకాలతో కాంగ్రెస్ యువజన సంఘం రాసిన లేఖపై సంతకం చేసినట్లు శశిథరూర్ ట్వీట్ చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే తప్పకుండా వాటిని నెరవేర్చుతానని స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనే వారిలో మనం సభ్యులమని శశిథరూర్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నానన్న థరూర్.. అది పార్టీకి ఎంతో మంచిదని భావిస్తున్నట్లు తెలిపారు
అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరుగుతాయని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. బరిలో ఉండటానికి ఎవరి ఆమోదం పొందాల్సిన అవసరం లేదని తెలిపింది. భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ కృషిచేస్తోందని.. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువమంది పోటీ చేస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: అయోధ్యలో 251మీటర్ల రాముడి ప్రతిమ.. ఐక్యతా విగ్రహాన్ని మించి..
ప్రయాణికుడి కడుపులో కేజీ బంగారం.. ఎక్స్‌రేలో బయటపడ్డ నాలుగు క్యాప్సూల్స్