Congress President Election : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తామని.. దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అధ్యక్షుడు మధుసూధన్ మిస్త్రీ. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు వివిధ పీసీసీల నుంచి 10 మంది ప్రతినిధుల మద్దతుతో నామినేషన్ దాఖలు చేయాలని సూచించారు. అన్ని పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 9,000 మంది పీసీసీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రతినిధులందరికీ పార్టీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ కొనసాగనుందని వివరించారు. ఐడెంటిటీ కార్డుపై క్యూ ఆర్ కోడ్ ఉంటుందని.. దానిపై ఫోటో లేని వారు.. ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20 తర్వాత ఓటర్ లిస్ట్ అందుబాటులోకి పెడతామని వెల్లడించారు. బుధవారం.. ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించామని వివరించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్
- నోటిఫికేషన్ జారీ: సెప్టెంబర్ 22
- నామినేషన్ల ప్రారంభం: సెప్టెంబర్ 24
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : సెప్టెంబర్ 30
- ఉప సంహరణ గడువు : అక్టోబర్ 8
- ప్రచార సమయం: అక్టోబర్ 8- అక్టోబర్ 16
- ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక తేదీ: అక్టోబర్ 17
- ఫలితాలు: అక్టోబర్ 19
దేశంలోని అతిపురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్.. నాయకత్వ సంక్షోభంలో ఉంది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనంతరం తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టారు. అయితే, పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్లో పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడిన 23 మంది సీనియర్ నేతలు.. సోనియాకు లేఖ రాశారు. పార్టీలో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, పార్లమెంటరీ బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బయటకు పొక్కింది.
ఇవీ చదవండి; 200 అడుగుల బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి