భాజపా, ఆరెస్సెస్ చేస్తున్న దుష్ట ప్రచారాన్ని సైద్ధాంతిక పరంగానే ఎదుర్కోవాలని కాంగ్రెస్ (Congress news) అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికార పార్టీ ప్రచారం చేసే అబద్ధాలను ప్రజల ముందు ఎండగట్టాలని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జీలు, పీసీసీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో (Congress Meeting today) భాగంగా ప్రసంగించిన సోనియా.. తప్పుడు ప్రచారాలను గుర్తించి, వాటికి దీటుగా బదులివ్వాలని కోరారు.
పార్టీలో సంస్కరణలు కోరుతూ లేఖ రాసిన 23 నేతలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు సోనియా. వ్యక్తిగత లక్ష్యాల కంటే.. పార్టీ బలోపేతమే ప్రతి ఒక్కరికీ ముఖ్యం కావాలని ఆకాంక్షించారు.
"మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కాపాడే ప్రక్రియ... తప్పుడు వార్తలకు దీటుగా బదులివ్వడంతోనే ప్రారంభమవుతుంది. భాజపా, ఆరెస్సెస్ చేసే దుష్టప్రచారాన్ని సైద్ధాంతికంగానే ఎదుర్కోవాలి. ఈ యుద్ధంలో గెలవాలంటే పూర్తి నిశ్చయంతో వారి ప్రచారాన్ని తిప్పికొట్టి.. వారి అబద్ధాలను ప్రజలకు తెలియజేయాలి. చివరగా, నేను చెప్పేది ఒకటే. పార్టీలో క్రమశిక్షణ, ఐక్యమత్యం ఉండాలి. పార్టీని బలోపేతం చేయడమే మనందరి కర్తవ్యం కావాలి. పార్టీని బలపర్చాలన్న భావన.. వ్యక్తిగత ఆశయాలను అధిగమించాలి."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ (Congress Meeting today) జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi news), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సహా పలు రాష్ట్రాల నుంచి సీనియర్ నేతలు హాజరయ్యారు.
రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు, చేపట్టాల్సిన చర్యలు, సంస్థాగత ఎన్నికల అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: యూపీ ప్రజలకు ప్రియాంక మరో వరం.. కాంగ్రెస్ను గెలిపిస్తే...