కరోనా మహమ్మారి వంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఆక్షేపించింది. పెంచిన రేట్లను వెంటనే ఉపసంహరించుకుని, ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని డిమాండ్ చేసింది.
పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు వాటిపై విధించే ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం వస్స ధరల భారాన్ని ప్రజలు మోయలేకపోతున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. కరోనా కాలంలో మార్చి 5 తర్వాత పెట్రోల్, డీజిల్‌పై పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఏర్పడే ప్రయోజనాన్ని నేరుగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వినియోగదారులకు అందించాలన్నారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డిజిల్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు.