CM KCR Inaugurated Ts New Secretariat: రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఠీవీగా రాజసం ప్రదర్శిస్తున్న సమీకృత సచివాలయ భవనం ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల్లో భాగంగా ఉదయమే యాగం నిర్వహించారు. సుదర్శన యాగంలో పాల్గొన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు...ద్వారలక్ష్మి పూజ చేశారు. వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన సుదర్శనయాగం అనంతరం చండీహోమం, వాస్తు హోమం నిర్వహించారు. పూర్ణాహుతితో యాగ క్రతువు ముగిసింది.
వేదపండితుల ఆశీర్వచనం మధ్య సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్: మధ్యాహ్నం అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర పాలనా సౌధాన్ని ప్రారంభించారు. తూర్పున ఉన్న ప్రధాన ద్వారం గుండా సచివాలయంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌కి... సీఎస్ , డీజీపీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. నడుచుకుంటూ నూతన సచివాలయంలోకి వచ్చిన కేసీఆర్... ముందుగా యాగశాలకు వెళ్లి పూజలో పాల్గొన్నారు. భవన ప్రధాన ద్వారం ఎదురుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత గ్రాండ్ ఎంట్రీ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి... రిబ్బన్ కట్ చేసి నూతన సచివాలయాన్ని ప్రారంభించారు.
సీఎం కేసీఆర్‌కు అభినందనల వెల్లువ: అనంతరం సీఎం కేసీఆర్ అక్కడి నుంచి బ్యాటరీ వాహనంలో కింది అంతస్తులో ఉన్న సమావేశ మందిరానికి వెళ్లి అక్కడ వాస్తుపూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత నేరుగా తన కార్యాలయం ఉన్న ఆరో అంతస్తుకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఛాంబర్లో పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం మధ్య కుర్చీలో ఆసీనులయ్యారు. వెంటనే ముఖ్యమైన ఆరు దస్త్రాలపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఈ ప్రక్రియ అంతా మధ్యాహ్నం ఒంటి గంటా 32 నిమిషాలలోపు పూర్తి అయింది. సీఎంకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.
గంట లోపే పూర్తి అయిన ప్రారంభోత్సవ ఘట్టం: సీఎం కేసీఆర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చున్నారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై సంతకం చేశారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 వరకు అధికారులు కుర్చీల్లో కూర్చొని ఒక దస్త్రంపై సంతకాలు చేశారు. దీంతో ప్రారంభోత్సవ ఘట్టం గంటలోపే పూర్తి అయింది. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
ఇవీ చదవండి: