కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు ఈ మధ్య ఆ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. యడ్డీ స్థానంలో మరొకరిని నియమిస్తారనే ఊహాగానాలు పార్టీలోనూ అంతర్గతంగా చక్కర్లు కొడుతున్నాయి. నాయకత్వ మార్పు ఉండదని పార్టీ అధిష్ఠానం చెబుతున్నా ఈ వదంతులకు అడ్డుకట్ట పడటం లేదు.
సీఎం సన్నిహితులు ఈ వార్తలను ఖండించే వరకు వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి యడ్డీ పదవి చేపట్టినప్పటి నుంచి సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అమిత్ షా, రాష్ట్ర ఛైర్పర్సన్ అరుణ్ సింగ్.. వీటిని ఖండించారు. పదవి కాలం ముగిసే వరకు యడ్డీనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి.
నేతల దిల్లీ పర్యటన
తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి సీపీ యోగేశ్వర్ దిల్లీకి పయనం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాశమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాడ్, బసనగౌడ పాటిల్ యత్నాల్.. నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. యోగేశ్వర్ దిల్లీ పర్యటన ఇందుకు బలం చేకూర్చుతోంది. అయితే, అరవింద్ దిల్లీకి వెళ్లినప్పుడు మాత్రం హైకమాండ్ వారిని తిప్పి పంపింది. పార్టీ పెద్దలతో కలిసేందుకు అరవింద్‌కు అనుమతి లభించలేదని భాజపా వర్గాలు చెబుతున్నాయి.
వేరే రాష్ట్రానికి గవర్నర్‌గా..?
రాజీనామా ద్వారా గౌరవప్రదంగా పదవి నుంచి వైదొలగాలని యడియూరప్పకు పార్టీలో కొందరు నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. అనంతరం ఏదైనా రాష్ట్ర గవర్నర్ పదవి కానీ, పార్టీలో కోరుకున్న హోదాను గానీ కట్టబెట్టాలని కోరుకుంటున్నారు. యడ్డీ కుమారుడికి కేబినెట్లో స్థానం కూడా ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు.
కొత్త సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, డిప్యూటీ సీఎం అశ్వథనారాయణ్, ఓ లింగాయత్ నేత పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వదంతులన్నింటినీ సీఎం యడ్డీ అనుచరులు కొట్టిపారేస్తున్నారు. విపక్షాలే ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు.
ఇదీ చదవండి- వీరప్పన్ తూటాలకు ఎదురు నిలిచిన పోలీసు మృతి