Varun Singh: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది.
డిసెంబర్ 8న తమిళనాడు కూనూర్ సమీపంలో చాపర్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు వాయుసేన అదేరోజు ప్రకటించింది. మృతుల్లో భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సిబ్బంది మరణించారు.
Chopper Crash: తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌కు తొలుత వెల్లింగ్టన్ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కొద్దిరోజులకు బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు.
8 రోజులు మృత్యువుతో పోరాడిన అనంతరం బుధవారం కన్నుమూశారు.
వాయుసేన సంతాపం..
వరుణ్ సింగ్ మృతి పట్ల వాయుసేన సంతాపం తెలిపింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
వరుణ్ సింగ్ మృత్యువుతో పోరాడి ఓడారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించారని ట్వీట్ చేశారు. వరుణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
PM Narendra Modi condolences:
గ్రూప్ కెప్టెన్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన మృతి తనను బాధించిందని, దేశానికి ఆయన చేసిన సేవలు మరవలేవని ట్వీట్ చేశారు.
వరుణ్ సింగ్ కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
బంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రముఖులు.. వరుణ్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
శౌర్య చక్ర..
వరుణ్ సింగ్ తండ్రి.. ఏఏడీ(ఆర్మీ ఎయిర్ డిఫెన్స్)లో విధులు నిర్వహించారు. వరుణ్ సోదరుడు తనూజ్.. ప్రస్తుతం నేవీలో లెఫ్టినెంట్ కమాండర్.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌కు చెందిన వరుణ్ ఇప్పటికే ఓసారి మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్‌లో.. ఆయన నడుపుతున్న తేజస్ విమానంలో.. గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో వరుణ్.. విమానం నుంచి దూకేందుకు ఆస్కారం ఉంది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది.
ఇవీ చూడండి: Bipin Rawat last speech: బిపిన్ రావత్ చివరి సందేశం.. ఏం మాట్లాడారంటే..?