కఠినమైన శీతాకాలం దగ్గరపడుతున్నా.. చైనా గుడ్లురుమి భారత్‌ను భయపెట్టాలనే ప్రయత్నాలను మానడంలేదు. తాజాగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు విఫలం అయ్యాయి. దీంతో డ్రాగన్ మళ్లీ తన పంథాను అనుసరించడం మొదలుపెట్టింది. సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. కానీ, ఆయుధాలు కాదు.. చైనా జవాన్లు అతిశీతల వాతావరణానికి అలవాటు పడాలని ఆ దేశ సైనిక నిపుణులు అంటున్నారు. మరోపక్క చైనా ఆయుధ తరలింపును ఈస్టర్న్ కమాండర్ మనోజ్ పాండే కూడా ధ్రువీకరించారు. భారత్ కూడా తగిన ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.
ఏం జరుగుతోంది..
వాస్తవాధీన రేఖ వెంట చైనా అత్యాధునిక 100 దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను తరలించింది. ఈ విషయాన్ని చైనా సైనిక వర్గాలు 'సౌత్ చైనా మార్నింగ్' పోస్టు వద్ద ధ్రువీకరించాయి. శీతాకాలం వస్తుండటంతో చైనా తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. భారత్ ఇప్పటికే అత్యాధునిక ఎం777 అల్ట్రాలైట్ హోవిట్జర్లను హిమశిఖరాలకు తరలించింది. తాజాగా చైనా 100 పీసీఎల్-181 లైట్ ట్రక్ మౌంటెడ్ హోవిట్జర్లను ఎల్‌ఏసీ వద్దకు తీసుకొచ్చింది. భారత్ వాడే ఎం777 కంటే ఇవి రెట్టింపు దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని పీఎల్‌ఏ చెబుతోంది.
ఇప్పటికే పీసీఎల్-191లను మోహరించిన డ్రాగన్
తాజాగా వచ్చిన పీసీఎల్-181 కంటే శక్తిమంతమైన పీసీఎల్-191 హోవిట్జర్లను ఏప్రిల్ నెలలోనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎల్‌ఏసీ వద్దకు చేరవేసింది. ఈ విషయాన్ని అప్పట్లో చైనా ప్రభుత్వానికి చెందిన సీసీటీవీ ధ్రువీకరించింది. ఇది దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై కూడా దాడి చేయగలదని పేర్కొంది. వేర్వేరు దూరాల్లోని లక్ష్యాలను ఛేదించడం కోసం పీఎల్‌ఏ వీటిల్లోని రకాలను మోహరిస్తున్నట్లు మకావ్‌కు చెందిన సైనిక నిపుణులు ఆంటోనీ వాంగ్ టాంగ్ పేర్కొన్నారు. అంతేకాదు ఇక్కడ ఆయుధాల కంటే వణికించే శీతాకాలాన్ని ఎదుర్కోవడం అసలు సిసలైన సవాల్ అని పేర్కొన్నారు. బీజింగ్‌కు చెందిన సైనిక నిపుణుడు ఝూవా ఛెన్‌మింగ్ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. శీతాకాలాన్ని తట్టుకొని నిలబడటమే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రథమ ప్రాధాన్యమన్నారు.
చినూక్‌ల సాయంతో భారత్ శతఘ్నుల తరలింపు..
అమెరికా నుంచి కొనుగోలు చేసిన చినూక్ హెలికాప్టర్లు భారత్‌కు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ఇటీవల సెప్టెంబర్‌లో ఎం777 లైట్ హెవిట్జర్లను భారత్ వీటి సాయంతోనే అక్కడకి తరలించింది. మిగిలిన భారీ శతఘ్నులు రోడ్డుమార్గంలో వెళ్లాయి. మరోపక్క భారత్ కూడా హిమసీమల్లో రెండో శీతాకాలం ఎదుర్కోవడానికి వేగంగా ఏర్పాట్లు చేసుకొంటోంది. దీంతో చైనా సైనికుల కదలికలను గుర్తించేందుకు శక్తిమంతమైన నిఘా నేత్రాలను ఏర్పాటు చేసింది.
భారత్ ఎటువంటి టెక్నాలజీ వాడుతోంది..
ఈ సారి శీతాకాలంలో వాస్తవాధీన రేఖపై ఈస్ట్రన్ కమాండ్ మరింత దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా సైనికుల సంఖ్యపై కాకుండా టెక్నాలజీని నమ్ముకొంది. ఇందు కోసం సరిహద్దుల వెంట భారీ సంఖ్యలో రాడార్లు, సెన్సర్లు, కెమెరాలు, మోషన్ డిటెక్టర్లును ఏర్పాటు చేసింది. ఇవన్నీ దేశీయంగా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఆధారంగానే పనిచేస్తాయి. అంతేకాదు ఉపగ్రహాల నుంచి సేకరించిన చిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటోంది. దీంతో ఎల్‌ఏసీ, చైనా భూభాగంలో పీఎల్‌ఏ కదలికలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాస్తవానికి ఇటువంటి టెక్నాలజీని అరుణాచల్ ప్రదేశ్‌లో పూర్తిగా ప్రవేశపెట్టేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ మొత్తానికి విస్తరించనున్నారు. ఇది పూర్తియితే చైనా సైనికుల కదలికలు మన దళాలకు పూర్తిగా తెలుస్తాయి. 4వ కోర్ అధీనంలోని నిఘా కేంద్రం సరిహద్దుల్లో అమర్చిన చాలా పరికరాల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషిస్తోంది. దీనిలో ఎల్‌ఏసీ ఆవలవైపు చైనా భూభాగంలో పీఎల్‌ఏ సైనికుల బంకర్లు, వారి కదలికలు స్పష్టంగా భారత్‌కు తెలుస్తున్నాయి.
నిఘా కోసం వినియోగించే దీర్ఘశ్రేణి డ్రోన్ల విషయంలో కూడా సైన్యం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈస్ట్రన్ కమాండ్‌లోని ఆర్టలరీ కోర్ కింద ఉన్న డ్రోన్లను ప్రస్తుతం ఆర్మీ ఏవియేషన్ కోర్ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో సమన్వయ లోపానికి అవకాశం లేదని చెబుతున్నారు.
పీఎల్‌ఏ సైనికులను గుర్తించే సాఫ్ట్‌వేర్..
భారత్ అత్యంత కీలకమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. 'ఫేస్ రికగ్నైజర్'గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ను సిగ్నల్ కోర్‌లో మేజర్‌గా పని చేసే భవ్యా శర్మ అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్ చైనా సైనికులను గుర్తించగలదు. చాలా కాలంగా సరిహద్దుల్లో చైనా సైనికుల కదలికలను చిత్రీకరించిన వీడియోల డేటాబేస్ వాడి దీనిని అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ లేకపోతే పీఎల్‌ఏ సైనికులను గుర్తించడానికి చాలా సమయం పట్టేది.
ఈ సారి శీతాకాలం కూడా చైనీయులకు సవాలే..
గతేడాది లద్దాఖ్ ప్రాంతంలో చైనా తమ దళాలను తరచూ మార్చేసింది. వారు ఏడాది కూడా అక్కడ ఉండలేకపోయారు. చాలా మంది ఈ వాతావరణం తట్టుకోలేక గాయపడటమో, అస్వస్థతకు గురికావడమో జరిగింది. వాస్తవానికి భారత్ కూడా అక్కడ 40 శాతం వరకు దళాలను మారుస్తుంది. పర్వత యుద్ధతంత్ర శిక్షణ పొంది వచ్చిన భారత సైనికులు కనీసం రెండేళ్లపాటు కొనసాగుతారు.
అతి శీతల పరిస్థితుల్లో గాయాలు కాకూడదు. పొరబాటున లోహాలను చేతులతో పట్టుకున్నా గాయపడక తప్పదు. దీంతో పాటు అక్యూట్ మౌంటేన్ సిక్‌నెస్, హైఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడీమా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. వారాల కొద్దీ బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో మానసిక సమస్యలు కూడా తెలెత్తుతాయి.
చైనా సైనికులు ఆక్సిజన్ అందించే ప్రత్యేక గదుల్లో ఉన్నట్లు కొన్నాళ్ల కిందట గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. వాస్తవానికి ఇది గొప్పగా చెపుకోవాల్సిన అంశం కాదు. వారిని చలి వాతావరణానికి అలవాటు పడనివ్వడంలేదు. 2,500 నుంచి 3,000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రదేశాల్లో అడుగుపెట్టే కొద్దీ గాలి ఒత్తిడి తగ్గి వాటిల్లో ఆక్సిజన్ 30శాతం వరకు పడిపోతుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన ప్రాణవాయువు అందదు. వేగంగా ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లేకొద్దీ శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. దీనిని తట్టుకోవడానికి హపోబ్యాగ్‌ను వాడుతుంటారు. అక్కడి వాతావారణానికి అలవాటు పడటం ఒక్కటే మార్గం. 3వేల మీటర్లు దాటాక కొన్నాళ్లు అక్కడ ఉండి వాతావరణానికి అలావాటు పడాలి. ఇక 4వేల మీటర్ల ఎత్తు దాటిన తర్వాత ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది.
ఇవీ చూడండి: అమెరికాకు చైనా షాక్- హైపర్సోనిక్ అణు క్షిపణి ప్రయోగం!
క్వాడ్ కొత్త కూటమి.. భారత్‌కు బలిమి!