ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ నక్సల్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నక్సల్‌ను.. మావోయిస్టు మిలీషియా కమాండర్ వెట్టి హుంగాగా గుర్తించారు పోలీసులు. అతడిపై రూ. లక్ష రివార్డు ఉందని వెల్లడించారు. ఘటనాస్థలిలో పిస్తోల్, 2 కిలోల ఐఈడీ, ఓ నాటు తుపాకీ, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని కటేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు జిల్లా సాయుధ పోలీసులు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటలకు నక్సల్స్, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమైనట్లు ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.
ఈ ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టులు మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.