అనారోగ్యంతో బాధపడుతోన్న ఫగ్నిబాయి అనే 50ఏళ్ల మహిళను సరైన సయమంలో ఆసుపత్రికి తరలించి ప్రాణం కాపాడింది ఓ అంబులెన్స్. అందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా? ఆమె ఉన్నది మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్ లోని దంతెవాడలో. దీనికి తోడు రోడ్డు, రవాణ వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది . దీంతో అక్కడికి రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంబులెన్స్, వైద్య సిబ్బంది హుటాహుటిన బిలాస్‌పుర్ తండాకు చేరుకున్నారు. మహిళకు సరైన వైద్య సేవలు అందించడమే కాకుండా... పట్టణంలో ఉండే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
దంతెవాడ లాంటి ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకోవడం చాలా కష్టంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు. అయితే ఈ ఘటనలో అంబులెన్స్ సరైన సమయానికి వచ్చిందని తెలిపారు. తమ తండాకు చేరుకోవాలంటే రవాణా వ్యవస్థ లేకపోగా.. మధ్యలో కఠినమైన రోడ్లు దాటడం సవాలుగా మారుతోందని తెలిపారు.
" అంబులెన్స్ దంతెవాడ గ్రామాలకు వేసవికాలంలో మాత్రమే చేరుకోగలదు. 2020 లో కూడా మేము అంబులెన్స్‌ను పిలిచాము. ఈ ఏడాదిలో ఇది రెండవసారి. ఒక వైద్య బృందం మా గ్రామానికి అప్పుడప్పుడూ వస్తోంది. దగ్గరలోని పులియా చేరుకోవడానికి 10 కి.మీ ప్రయాణించాలి. దీంతో అనారోగ్యంతో బాధపడే వారిని మేము సైకిల్, బైక్‌లపైనే తీసుకువెళ్లాల్సి వస్తోంది."
- గ్రామస్థులు
గ్రామానికి రహదారులు, వంతెనలు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య సేవలు చేరడం చాలా ఆలస్యం అవుతోందని స్థానికులు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.