ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఏడుగురు వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. వారిని నక్సల్స్ అపహరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సుక్మా జిల్లాలోని జగరగుండా పోలీస్ స్టేషన్ పరధిలో వివిధ కారణాలతో ఏడుగురిని నక్సల్స్ అపహరించి ఉండొచ్చని జిల్లా ఎస్పీ సునీల్ శర్మ చెప్పారు. వారిని నక్సల్స్ బలవంతంగా తీసుకెళ్లారా? అన్న విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. వారి జాడ కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కానీ వారు బంధువుల పెళ్లికి, వ్యవసాయ పనులకు వేరే ఊళ్లకు వెళ్లారని స్థానికులు చెబుతుండటం గమనార్హం. కనుమరుగైన వారి కోసం ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని పోలీసులు వివరించారు.
మాజీ సహచరుని కాల్చివేత..
బిజాపుర్లో.. జనజీవనం సాగిస్తున్న మాజీ నక్సల్ రాజు వెంజం(28)ను నక్సల్స్ కాల్చిచంపారు. నక్సలిజాన్ని వీడి చాలాకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యవసాయం చేసుకుంటున్నాడు రాజు. పొలం పనుల్లో నిమగ్నమైన అతన్ని మావోయిస్టులు ఆదివారం కాల్చి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు. అయితే.. రాజు నక్సలిజమ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అధికారికంగా లొంగిపోలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:'ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా?'